ఆశలు రేకెత్తిస్తున్న రెమిడిస్‌విర్‌

Drug Used to Treat Ebola May Help COVID-19 Patients - Sakshi

హ్యూస్టన్‌: ప్రాణాంతక ఎబోలా వైరస్‌ చికిత్సలో ఉపయోగించే రెమిడిస్‌విర్‌ మందు కోవిడ్‌ రోగులపై జరగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరిన్ని ప్రయోగాలు పూర్తయితేగానీ ఈ మందును కోవిడ్‌ చికిత్సకు సిఫారసు చేసే అవకాశాల్లేవు. టెక్సస్‌లోని హ్యూస్టన్‌ మెథాడిస్ట్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు వెల్లడించిన దాని ప్రకారం.. అప్పుడప్పుడే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి రెమిడిస్‌విర్‌ మందును ఇచ్చారు. రెమిడెస్‌విర్‌ను ఎబోలా వైరస్‌కు చికిత్స కల్పించేందుకు తయారు చేశారు. చైనాలో జరిగిన అధ్యయనంలోనూ ఈ మందు కోవిడ్‌ బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నట్లు స్పష్టమైంది. న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇటీవల ఒక పరిశోధన వ్యాసం ప్రచురిస్తూ రెమిడిస్‌విర్‌ తీసుకున్న కోవిడ్‌–19 బాధితుడు 24 గంటల్లోనే మెరుగైన ఆరోగ్య స్థితికి వెళ్లడాన్ని వివరించింది.

కాగా, ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ ప్రకటించారు. వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్‌ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్‌ తెలిపారు. 1994 నుంచి యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో గిల్బర్ట్‌ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజా సమాచారం కరోనా బాధితుల సంఖ్య 25 లక్షలు దాటగా, మృతుల సంఖ్య లక్షా 70 వేలు దాటింది. కోవిడ్‌ సోకి ఇప్పటివరకు 658,956 మంది కోలుకున్నారు.

చదవండి: కరోనాకు ముందే దారుణ పరిస్థితులు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top