ఇది కేక్ అంటే కేక్ కాదు! పదిలంగా వజ్రాలు పొదిగిన కేక్. విగ్రహాల్లా బొమ్మలు చెక్కిన కేక్. దీని ధర వింటే మాత్రం తినకముందే కళ్లు తిరిగడం ఖాయం. అక్షరాల 45 కోట్ల రూపాయల కేక్.
లండన్: ఇది కేక్ అంటే కేక్ కాదు! పదిలంగా వజ్రాలు పొదిగిన కేక్. విగ్రహాల్లా బొమ్మలు చెక్కిన కేక్. దీని ధర వింటే మాత్రం తినకముందే కళ్లు తిరిగడం ఖాయం. అక్షరాల 45 కోట్ల రూపాయల కేక్. దీన్ని తయారు చేసిందీ అట్లాంటీ ఇట్లాంటీ మహిళ కాదు. ప్రముఖ బ్రిటీష్ డిజైనర్ డెబ్బీ వింగమ్. దాదాపు 11 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్‌ను డిజైన్‌చేసి అమ్మిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈ కేక్‌ను కూడా అమ్మేశారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త 45 కోట్ల రూపాయలు చెల్లించి తన కూతురు బర్త్ డే కమ్ ఎంగేజ్‌మెంట్ పార్టీకి తీసుకెళ్లారట. ఆయన పేరును మాత్రం వెల్లడించలేదు. ఇన్‌కం టాక్స్ బెడద కాబోలు.
ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన కేక్ ప్రపంచ రికార్డుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును తాను బద్దలుకొట్టానని బ్రిటీష్ డిజైనర్ డెబ్బీ వింగమ్ తెలిపారు. ఆరడుల పొడవున్న ఈ కేక్ వెయ్యి పౌండ్ల బరువుందని, దీన్ని తయారు చేసేందుకు 1100 గంటలు పట్టిందని ఆమె చెప్పారు. కేక్‌లో మొత్తం నాలుగువేల రంగురంగుల వజ్రాలను పొదిగామని, అందులో 17 వజ్రాల విలువే దాదాపు 30 కోట్ల రూపాయలు ఉంటుందని ఆమె తెలిపారు.
కేక్ కేవలం వజ్రాలతో మెరిసిపోవడమే కాదని, అనేక చాక్లెట్ ఫ్లేవర్లు కలిగిన ఈ కేక్‌ను తిన్న వారు ఆ రుచిని కూడా కేక్‌లాగే మరచిపోరని డెబ్బీ వింగమ్ చెబుతున్నారు. ఆమె మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకోవాలంటే దాన్ని కొనుక్కున్న అరబ్ వ్యాపారి ఎవరో, ఆయన కూతురు ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో కనుక్కోవాల్సిందే.