
21 మారు పేర్లు ఉపయోగించిన దావూద్
యూకే తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు.
లండన్: యూకే తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు. యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్స్ టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్‌కు పాకిస్తాన్‌లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు.
దావూద్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేర్‌లో జన్మించాడని, ఆయన భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే భారత్ తన పాస్‌పోర్టును రద్దుచేసిన తరువాత దావూద్ భారత్, పాక్ నుంచి ఇతరుల పేరిట పాస్‌పోర్టులు సేకరించి దుర్వినియోగం చేశాడని జాబితాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఇతరులతో ఆర్థికపర లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తారు. అలాగే వారి ఆస్తులను స్తంభింపజేస్తారు.