‘కరోనా’కు ఒక్క రోజులో వంద మంది మృతి

CoronaVirus:100 People Dead With in 24 Hours in China - Sakshi

బీజింగ్‌ : చైనాలో కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయని, వైరస్‌ వ్యాపించే వేగం తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని చైనా వైద్యాధికారులు శనివారం నాడు సగౌరవంగా చెప్పుకున్నారు. అయితే 24 గంటల్లోనే వారి అంచనాలు తారుమారయ్యాయి. ఒక్క ఆదివారం నాడు 24 గంటల్లోనే చైనాలో 97 మంది కరోనా వైరస్‌ బారిన పడి మరణించారు. ఇతర దేశాల్లో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య చైనాలో 908కి, రోగుల సంఖ్య 3,062కు చేరుకుంది. 27 మంది విదేశీయులకు కూడా వైరస్‌ సోకినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది.
 
చైనాలో ఒక్క ఆదివారం నాడే మృతుల సంఖ్య 15 శాతం పెరగడం అటూ చైనాకు, ఇటు ప్రపంచ దేశాలకు ఆందోళనకరమైన విషయం. చైనా ప్రజల్లో ఎక్కువ మంది కొత్త సంవత్సర సెలవులను ముగించుకొని తిరిగి విధుల్లో చేరడం వల్ల కరోనావైరస్‌ మృతుల సంఖ్య పెరగి ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి పరిశీలిస్తే ఆదివారం నాడు షాంఘై, బీజింగ్‌ నగరాల రోడ్లు రద్దీగా కనిపించాయి. ప్రజలు ఇప్పటికీ ఆఫీసుల్లోకి రావడానికి భయపడుతున్నందున తమ సభ్యులైన కంపెనీలు సిబ్బందిని ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయని షాంఘైలోని పారిశ్రామిక మండలి సోమవారం వెల్లడించింది. కరోనావైరస్‌ బయట పడిన వుహాన్‌ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని అధికారులు విధించిన ఆదేశాలు ఆ ప్రాంతంలో ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. (చదవండి: ‘సార్స్‌’ను మించిన కరోనా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top