భౌతిక దూరం రెండు నుంచి మీటరుకు!

Coronavirus: Social Distancing Becomes One Metre - Sakshi

లండన్‌ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలంటూ ప్రపంచంలో చాలా దేశాలు తమ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ రెండు మీటర్ల దూరం అనేది అర్థరహితమని, అది శాస్త్రవిజ్ఞానంపై ఆధారపడి చెప్పింది కాదని బ్రిటీష్‌ ప్రభుత్వ సలహాదారు, నాటింగమ్‌ ట్రెంట్‌ యూనివర్శిటీ సోసియాలోజిస్ట్‌ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ డింగ్‌వాల్‌ చెప్పారు. ఒక మీటరు దూరాన్ని పాటిస్తే చాలునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందని, ఆ సూచనను డెన్మార్క్‌తోపాటు కొన్ని యూరప్‌ దేశాలు ఇప్పుడు పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. (అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్‌!)

రెండు మీటర్లు లేదా ఆరున్నర అడుగుల దూరాన్ని పాటించాల్సిందిగా బ్రిటీష్‌ ప్రభుత్వం ఎందుకైన మంచిదని తన ప్రజలకు సూచించి ఉంటుందని, ఒకటి లేదా ఒకటిన్నర మీటరు దూరాన్ని పాటించాలని చెబితే ఆ దూరమెంతో ప్రజలకు తెలియక దగ్గరగా ఉండే ప్రమాదం ఉందన్న ముందు జాగ్రత్తతో కూడా సూచన చేసి ఉండవచ్చని డింగ్‌వాల్‌ అన్నారు. అన్ని రకాల షాపుల వద్ద రెండు మీటర్ల దూరం పాటించడం కష్టం అవుతుందని, అందుకని ఒకటిన్నర మీటరు దూరం పాటిస్తే చాలునని ఆయన సూచించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఐయాన్‌ డంకెన్‌ స్మిత్‌ కూడా సామాజిక భౌతిక దూరం 1.5 మీటర్లు ఉంటే చాలునని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజలు భౌతిక దూరాన్ని రెండు మీటర్లు పాటిస్తుండగా, వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిన్నర, ఒక మీటరు దూరాన్ని మాత్రమే పాటిస్తున్నారు. (కరోనా: భారత దేశానికి ఊరట)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top