ప్రేమ గాయం చేసింది.. అతను మాత్రం..

Coral Castle Florida - Sakshi

ప్రేమ తన మనసుకు గాయం చేసినా.. అతను మాత్రం ప్రేమే ఊపిరిగా బ్రతికాడు. తనను కాదన్న ప్రియురాలి మీద పగ పెంచుకోకుండా.. తన ప్రేమ ఎంత గొప్పదో ఆమెకే కాదు.. మొత్తం ప్రపంచానికే చాటి చెప్పాడు. తను ఒక్కడే కొన్ని సుదీర్ఘమైన సంవత్సరాలు.. రాత్రి,పగలు అని తేడా లేకుండా ఎంతో ఇష్టంతో ప్రేమ కోటను నిర్మించాడు. ఆ ప్రేమ చిహ్నమే ‘‘కోరల్‌ ​కాసిల్‌’’.

కోరల్‌ కాసిల్‌ వద్ద ఎడ్వర్డ్‌ లీడ్స్‌ స్కెల్‌నిన్‌(ఫైల్‌)
ప్రేమకు గుర్తుగా 28 సంవత్సరాలు..
యూరప్‌లోని లాట్వియాన్‌కు చెందిన ఎడ్వర్డ్‌ లీడ్స్‌ స్కెల్‌నిన్‌కు ఆగ్నెస్‌ స్కఫ్‌ అనే యువతితో తన 26 ఏట పెళ్లి నిశ్చయమైంది. ఇక అప్పటినుంచి ఆగ్నెస్‌ అంటే ఎడ్వర్డ్‌కు చెప్పలేని ప్రేమ మొదలైంది. ఆమెను తన దాన్ని చేసుకునే రోజు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూడటం మొదలుపెట్టాడు. పెళ్లికి ఒక రోజు మాత్రమే ఉందనగా ఓ విషాదమైన వార్త అతడి చెవినపడింది. ఆగ్నెస్‌ కంటే తను వయసులో చాలా పెద్దవాడైన కారణంగా ఆమె పెళ్లి వద్దనుకుందని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి తనని కాదనే సరికి తట్టుకోలేకపోయాడు. ఆమెను ఊహల్లోనుంచి చెరిపేయలేకపోయాడు.

కోరల్‌ కాసిల్  నిర్మాణం కోసం రాళ్లు తరలిస్తున్న ఎడ్వర్డ్‌(ఫైల్‌)
ఆ తర్వాత కొద్దిరోజులకు యూరప్‌ వదిలి అమెరికాలోని ఫ్లోరిడాకు వచ్చి స్థిరపడ్డాడు. నెలలు గడుస్తున్నా ఆమెను మర్చిపోలేకపోయాడు. తన ప్రేమకు గుర్తుగా ఏదైనా చేద్దామనుకున్నాడు. అప్పుడే ప్రేమ కోటను నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. 1923 సంవత్సరంలో కోట పనులను ప్రారంభించి దాదాపు 28 సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా ఓ అందమైన కోట రూపుదిద్దుకుంది. ఎడ్వర్డ్‌.. టన్నుల బరువైన సున్నపురాయిని అవసరమైన రీతిలో చెక్కుతూ ఈ కోటను నిర్మించాడు. రాళ్లతోటే కుర్చీలు, పాన్పులు, సింహాసనాలు, బాత్‌టబ్‌, అర్థ చంద్రకార ఆకృతుల వంటి వాటిని కూడా తయారుచేశాడు. కిడ్నీలు పాడవటంతో ఎడ్వర్డ్‌ 1951లో 64ఏళ్ల వయస్సులో మరణించాడు.

రహస్యాల ‘కోరల్‌ కాసిల్‌’
కోరల్‌ కాసిల్‌ నిర్మాణంపై, ఎడ్వర్డ్‌ లీడ్స్‌ స్కెల్‌నిన్‌పై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎడ్వర్డ్‌కు అతీత శక్తులు ఉన్నాయని, ఆ అద్భుత శక్తుల కారణంగానే కేవలం 5 అడుగుల ఎడ్వర్డ్‌ టన్నుల బరువైన రాళ్లను సుదూర తీరాలనుంచి తెచ్చి కోటను నిర్మించాడని కొంతమంది నమ్మకం. అతడు ఒంటరిగా రాత్రిళ్లు మాత్రమే కోట పనులు చేసేవాడని, తన అద్భుత శక్తులు బయటి ప్రపంచానికి తెలియకూడదన్న కారణంగానే అతడు రాత్రిని ఎన్నుకొన్నాడని, కోట నిర్మాణం సమయంలో అతడిని తప్ప వేరే వ్యక్తిని అక్కడ తాము చూడలేదని ముసలివాళ్లైన స్థానికులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top