అల్లుడా మజాకా...! | Chinese Man Builds Elevator That Only Goes Up to His 6th Floor | Sakshi
Sakshi News home page

అల్లుడా మజాకా...!

Oct 15 2017 3:54 AM | Updated on Oct 15 2017 3:54 AM

Chinese Man Builds Elevator That Only Goes Up to His 6th Floor

ఏదైనా పండగకి అల్లుడు ఇంటికొస్తున్నాడంటే చాలు.. మామగారి ఇంట్లో ఒకటే భయం.. ఎక్కడ అల్లుడికి మర్యాదల్లో లోటు వస్తుందో.. ఎప్పుడు అలిగి కూర్చుంటాడో అని ఎక్కడలేని రాచమర్యాదలు చేస్తుంటారు.. ఎన్ని మర్యాదలు చేసినా అప్పుడప్పుడు అల్లుడు అలకపాన్పు ఎక్కడం సహజమేననుకోండి.. మన దేశంలోనైనా.. విదేశాల్లోనైనా అల్లుడు ఎక్కడైనా అల్లుడే కదా.. అయితే సరిగ్గా ఇదే కోవకు చెందిన చైనాలోని ఓ మామ తన అల్లుడు ఆరంతస్తుల పైన ఉన్న ఇంటిలోకి ఎక్కలేకపోతున్నాడని ఏకంగా సొంత లిఫ్ట్‌నే ఏర్పాటు చేయించాడు.. చైనాలోని చోగింగ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ ఉంది.

క్సాంగ్‌ అనే వ్యక్తి ఆ అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. తనకి ఏ అవసరం వచ్చినా మెట్లు దిగి కిందకు వచ్చి పనిచూసుకుని తిరిగి అదే మెట్లు ఎక్కి ఇంటికెళ్లేవాడు. అయితే గతేడాది తన ఏకైక ముద్దుల కూతురుకి ఘనంగా వివాహం చేశాడు. తన అల్లుడిని కూడా ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి సదరు మామకి అల్లుడి పోరు ప్రారంభమైంది.. తాను రోజూ ఆ మెట్లు ఎక్కిదిగలేకపోతున్నాను మొర్రో అంటున్నాడు మామ మీద కస్సుబుస్సులాడుతున్నాడు.. అల్లుడి కోపాన్ని తట్టుకోలేక క్సాంగ్‌ ఏదోఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు.

అల్లుడిని ఇంట్లో నుంచి పంపించేస్తే తన కూతురు ఇబ్బందులు పడుతుందని ఆ ధైర్యం చేయలేకపోయాడు. దీంతో అల్లుడి కోసం అపార్ట్‌మెంట్‌కి పక్కన సొంతంగా లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. గతేడాది నిర్మాణాన్ని ప్రారంభించి ఇటీవలే దాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు కూడా.. ప్రస్తుతం ఈ లిఫ్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఇది కాస్తా ప్లానింగ్‌ అధికారుల చెవిన పడింది.

ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌కి నిబంధనల ప్రకారం లిఫ్ట్‌ అవసరం లేదు. ఒకవేళ అపార్ట్‌మెంట్‌ వాసులకు అవసరం అనిపిస్తే స్థానిక అధికారుల నుంచి అనుమతితో సొంత ఖర్చులతో లిఫ్ట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో వీటన్నింటినీ లెక్కచేయకుండా అల్లుడి కోపాన్ని తగ్గించేందుకు క్సాంగ్‌ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లిఫ్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దీనిపై అక్కడి అధికారులు సైతం గుర్రుగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement