విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!

China Threatens Overseas Uighurs Also Leaked Data Report Says - Sakshi

వాషింగ్టన్‌: విదేశాల్లో నివసిస్తున్న ఉగర్‌ ముస్లింలను కూడా అణచివేసే విధంగా చైనా కుట్రలు పన్నుతోంది. తమ అకృత్యాలు బయటపెట్టకుండా కట్టడి చేసేందుకు.. ​వారిపై ఎల్లప్పుడూ నిఘా వేసి బెదిరింపులకు దిగుతోంది. చైనాలోని ఉగర్‌ ముస్లింల స్థితిగతులపై నోరు విప్పినట్లయితే.. జింగ్‌యాంగ్‌లో ఉన్న వారి బంధువులకు హాని తలపెడతామంటూ హెచ్చరిస్తోంది. వాయువ్య చైనాలో గల జిన్‌జియాంగ్‌ను ‘అటానమస్‌ రీజియన్‌(స్వయంప్రతిపత్తి గల ప్రాంతం)’గా గుర్తించిన డ్రాగన్‌.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ మానవ హక్కుల సంస్థలు, కార్యకర్తలు చైనా ప్రభుత్వ తీరును నిరసిస్తూ‌.. మైనార్టీల హక్కులు కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఒక్కసారి వెళ్తే మళ్లీ రావొద్దు
ఈ నేపథ్యంలో జిన్‌జియాంగ్‌ను వీడి విదేశాలకు వెళ్లిన ఉగర్‌ ముస్లింపై కూడా చైనా నిఘా కొనసాగుతోందని ఇటీవల లీకైన ప్రభుత్వ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడవుతోందని అమెరికా మీడియా సంస్థ ది హిల్‌ పేర్కొంది. సదరు డాక్యుమెంట్లలో ఉన్న వివరాల ప్రకారం.. కరాకక్స్‌(జిన్‌జియాంగ్‌లోని ప్రాంతం) జాబితాలో యూరప్‌ దేశాల్లో నివసిస్తున్న 300 మంది ఉగర్లతో పాటు స్థానికంగా ఉంటున్న వారి బంధువుల సమాచారం కూడా ఉంది. ‘‘ఒక్కసారి దేశాన్ని విడిచి వెళ్లినవారు.. మళ్లీ ఇక్కడికి రాకూడదు’’ వంటి నిబంధనలను చైనా విధించింది. కాగా భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించినప్పటికీ.. స్వతంత్ర భావాలు గల ఉగర్లు మరోసారి దేశంలో అడుగుపెడితే స్థానికులను చైతన్యపరిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందునే చైనా ఈ నిబంధన విధించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆందోళన కలిగించే అంశం
ఇక ఈ కథనాలపై స్పందించిన ప్రపంచ ఉగర్‌ కాంగ్రెస్‌(డబ్ల్యూయూసీ).. పశ్చిమ దేశాల్లో నివసిస్తున్న ఉగర్లను చైనా టార్గెట్‌ చేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు డ్రాగన్‌ ప్రయత్నాలు చేస్తోందని.. తమకు సహకరిస్తేనే జిన్‌జియాంగ్‌లో ఉన్న తమ బంధువులకు రక్షణ కల్పిస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కెరిమ్‌ జేర్‌ అనే ఉగర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను మొదట్లో నార్వేలో ఉండేవాడిని. ప్రస్తుతం లండన్‌కు మారాను. నిజానికి కొన్నేళ్ల క్రితమే నాకో గుర్తు తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఉగర్ల గురించి చెప్పాలంటూ.. వాళ్ల కోసం పనిచేయాలని నన్ను కోరారు. కానీ నేను అందుకు నిరాకరించాను. అసలు లండన్‌లో ఉన్నానన్న సంగతి వాళ్లకు ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. ఎక్కడ ఉన్నా మా మీద నిఘా ఉండటం ఆందోళన కలిగించే అంశం’’ అని పేర్కొన్నారు.

కాగా గతంలోనూ పలువురు ఉగర్లకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ‘చైనా కేబుల్స్‌(క్లాసిఫైడ్‌ డాక్యుమెంట్లు)’పై దృష్టి సారించిన అంతర్జాతీయ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టుల బృందం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం వాడుతున్న టెక్నాలజీని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక కమ్యూనిస్టు రాజ్యమైన చైనాలో క్త్రైస్తవం, ఇస్లాంతో పాటు పలు మతాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి.. ఉగర్లను చైనా డిటెన్షన్‌ క్యాంపుల్లో బంధిస్తూ, వారి మత విశ్వాసాలపై ఆంక్షలు విధించిందంటూ షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top