ఒక్కరోజే 254 మంది మృతి

China reports 254 new virus deaths and 15,152 daily cases - Sakshi

హడలెత్తిస్తున్న కోవిడ్‌–19

మొత్తం మృతుల సంఖ్య 1,376

బీజింగ్‌/న్యూఢిల్లీ: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ మొదటిసారిగా బయటకొచ్చి చైనాలోని హుబాయి ప్రావిన్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 254 మంది మరణించారు. ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 1,367 మంది మరణించారు. తాజాగా మరో ఇద్దరు భారతీయులకి కోవిడ్‌ వ్యాధి సోకినట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకాక్‌ నుంచి భారత్‌కు వచ్చిన హిమాద్రి బర్మన్, నగేంద్ర సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్‌ సోకిందని అనుమానాలున్నాయని కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీబీఐ విమానాశ్రయం డైరెక్టర్‌ కౌషిక్‌ భట్టాచార్జీ వెల్లడించారు. బెలియాఘాటా ఐడీ ఆస్పత్రిలో వారిద్దరినీ అందరికీ దూరంగా వారిని ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మంత్రుల బృందం సమీక్ష
కరోనా వైరస్‌ తన ప్రతాపం చూపిస్తుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల బృందం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గురువారం నాడు వీరంతా సమావేశమై భారత్‌లో వైరస్‌ విస్తరణ, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానంతరం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు కేరళలో మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఎవరికీ వ్యాధి నిర్ధారణ కాలేదని ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు.

కొత్త విధానంతో పెరిగిన కేసులు  
చైనాలో రాత్రికి రాత్రి కోవిడ్‌ కేసులు అసాధారణంగా పెరిగిపోవడానికి కారణాలున్నాయి.ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ను గుర్తించడానికి వైరాలజీ ల్యాబ్‌లో న్యూక్లిక్‌ యాసిడ్‌ అనే ఒక పరీక్షని నిర్వహించేవారు. అందులో పాజిటివ్‌ వస్తేనే వ్యాధి ఉన్నట్టు ధ్రువీకరించేవారు. ఇప్పుడు అలా కాదు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టుగా సిటీ స్కానింగ్‌లో బయటకు వచ్చినా కరోనా వైరస్‌ సోకినట్టే లెక్కలు వేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. ఒకే రోజు 242 మంది మరణించడానికి, 14,840 కేసులు వెలుగులోకి రావడానికి కొత్త విధానం ద్వారా గణించడమే కారణమైందని హువాన్‌ వైద్యులు వెల్లడించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top