భారత్‌ అభ్యంతరాలపై పాక్‌, చైనా ఆక్షేపణ

China Pakistan Reacts On India Objections Over Bus Service Via POK - Sakshi

చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై ఇండియా అభ్యంతరం

భారత్‌ నిరసనలతో వెనకడుగు వేయం : చైనా

సాక్షి, న్యూఢిల్లీ : చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)లో భాగంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా ఓ బస్‌ సర్వీస్‌ త్వరలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ బస్‌ సర్వీస్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న భారత్‌ ఈ బస్ సర్వీస్‌​ తమ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని భారత్‌ ఇప్పటికే నిరసన తెలిపింది. పీఓకేను ఎప్పటికీ తమ భూభాగాంగానే పరిగణిస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. భారత్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నామని చైనా, పాకిస్తాన్‌లు వెల్లడించాయి.

(చైనా పాక్‌ ఒప్పందం.. భారత్‌ మండిపాటు)

పాకిస్తాన్‌కు చెందిన ఓ వార్తా పత్రిక కథనం ప్రకారం.. చైనా-పాక్‌ల మధ్య బస్‌ సర్వీస్‌పై భారత్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్‌  తప్పుడు సంకేతాలు పంపుతోందని మండిపడింది. భారత్‌ లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది. అభ్యంతరాలు తెలపడం ద్వారా కశ్మీర్‌ మాదే అనే ధోరణితో భారత్‌ వ్యవహరిస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది.

గగ్గోలు పెట్టినంత మాత్రన వివాదం సమసిపోదనీ, ఐక్యరాజ్య సమితి ఆద్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం సరైన పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది. ఇదిలాఉండగా.. భారత్‌ అభ్యంతరాలపై చైనా కూడా స్పందించింది. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులో మరే దేశం జోక్యం సహించబోమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు-కాంగ్‌ స్పష్టం చేశారు. ఇండియా అభ్యంతరం తెలిపినంత మాత్రాన కశ్మీర్‌ అంశంపై చైనా విధానం మారబోదని తెలిపింది. ఈ మేరకు పాక్‌ పత్రిక  ప్రచురించింది. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్‌.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్‌ సర్వీస్‌ నవంబర్‌ 13న ప్రారంభం కానుందని సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top