గాల్వన్‌ లోయ ప్రాంతం మాదే: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు

China Claims Sovereignty Over Galwan Valley Amid Violent Clashes At Border - Sakshi

బీజింగ్‌: గాల్వన్‌ లోయ ప్రాంతం తమదేనని.. భారత దళాలే వాస్తవాధీన రేఖను దాటి తమ సైనికులపై దాడులు చేశారంటూ చైనా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడా భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపించింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా భారత్‌ తమ సైనికులను కట్టడి చేయాలంటూ ఎదురుదాడికి దిగింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ బుధవారం మాట్లాడుతూ.. ‘‘గాల్వన్‌ లోయ ప్రాంతం ఎల్లపుడూ చైనా భూభాగానికి చెందినదే. కమాండర్‌ స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడా భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయి. తమ సైనికులను క్రమశిక్షణతో మెలిగేలా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కవ్వింపు చర్యలు మానుకుని.. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరుతున్నాం’’ అంటూ భారత సైన్యంపై అక్కసు వెళ్లగక్కారు.(విషం చిమ్మిన చైనా..)

అదే విధంగా.. సరిహద్దు ఉద్రిక్తతలపై దౌత్యపరమైన, సైనిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే .. తాజా ఘర్షణలో చైనా తప్పేమీ లేదంటూ తమ ఆర్మీని వెనకేసుకువచ్చారు. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగం వైపే ఘర్షణ జరిగింది. కాబట్టి ఇందులో తప్పెవరిదో స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో చైనాను నిందించడానికి ఏమీ లేదు’’అని వ్యాఖ్యానించారు. భారత్‌తో ఘర్షణను తాము కోరుకోవడం లేదని.. చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో  20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top