‘పెట్రో’ పరిష్కారంపై చర్చిస్తున్నాం

Centre mulling immediate solution to deal with fuel prices - Sakshi

రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి: ధర్మేంద్ర ప్రధాన్‌

భువనేశ్వర్‌/ముంబై:  పెట్రో ధరలు పెరగడంపై  సత్వరమే ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నట్లు పెట్రోలియం  శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. పెట్రో బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విషయమై ప్రభుత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.  గురువారం ఆయన భువనేశ్వర్‌లో మాట్లాడారు. ‘పెట్రోల్, డీజిల్‌ ధరల్ని తగ్గించేందుకు వీటిని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ యోచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలోపు ఈ సమస్యకు వెంటనే ఓ పరిష్కారం కనుగొనడంపై కేంద్రం చర్చిస్తోంది.

పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాల పాత్ర ఉంది’ అని అన్నారు. పెట్రో సమస్యపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, వెనిజువెలా దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై పెట్రోబాదుడుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్, అమ్మకపు పన్నుల్ని రాష్ట్రాలు తగ్గించాలని నీతిఆయోగ్‌ సూచించింది. ఆర్థికలోటును కట్టడిచేయడం, ముడిచమురు ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడం వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్నందున ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించడం వీలుకాదని స్పష్టంచేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top