
ఆపిల్ వినెగర్‌తో మరో మంచి ఫలితం
ఆపిల్ సైడర్ వినెగర్‌ను ఆహారానికి ముందు ఔషధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎంతోమంది డాక్టర్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
న్యూయార్క్: ఆపిల్ సైడర్ వినెగర్‌ను ఆహారానికి ముందు ఔషధంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎంతోమంది డాక్టర్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దానివల్ల ప్రయోజనాలకు మించి అనర్థాలున్నాయని వాదిస్తున్న డాక్టర్లు కూడా లేకపోలేదు. అయితే ఇటీవల జరిపిన మరో అధ్యయనంలో టైప్ టూ డయాబెటీస్ రోగులకు ఆపిల్ వినెగర్ ఎంతో పనిచేస్తుందని తేలింది.
రాత్రిపూట భోజనానికి ముందు రెండు టీ స్ఫూన్లకు మించకుండా ఆపిల్ వినెగర్‌ను తీసుకోవడం ఎంతో మంచిదని ‘డయాబెటిక్ కేర్’ పత్రిక తాజా సంచికలో పేర్కొన్నారు. డయాబెటీస్ లేని వారిని, వచ్చే అవకాశం ఉన్న వారిని, ఇప్పటికే డయాబెటీస్‌తో బాధ పడుతున్నవారిని మూడు బందాలుగా ఎంపికచేసి వైద్యులు వారికి రాత్రిపూట భోజనానికి ముందు ఆపిల్ వినెగర్‌ను ఇచ్చారు. ఆ మరుసటి రోజే వారికి సుగర్ పరీక్షలు నిర్వహించగా, ఆరోగ్య వంతుల్లో, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వారిలో సుగర్ స్థాయి 50 శాతం తగ్గగా, డయాబెటీస్‌తో బాధపడుతున్న వారిలో సుగర్ లెవల్ 25 శాతం తగ్గింది.
ఏయే ప్రయోజనాలు....
ఆపిల్ వినెగర్‌ను ఔషధంగా తీసుకుంటే శరీరం బరువు తగ్గుతుందని, అధిక ఆకలిని నియంత్రిస్తుందని, రక్తంలో ట్రైగ్లిజరాట్స్‌ను తగ్గించడం వల్ల గుండె పోట్లు రాకుండా నివారిస్తుందని వైద్యులు ఇదివరకే తేల్చారు. వినెగర్‌ను తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుందని, శరీరంలో పొటాషియం తగ్గుతుందని, ఎసిడిటి పెరుగుతుందని కూడా వైద్యులు హెచ్చరించారు. అయితే పంటికి తగులకుండా నేరుగాగానీ, నీటితో కలిపిగానీ మోతాదులో తీసుకుంటే ఎలాంటి హాని లేదని ఇప్పుడు వైద్యులు తెలియజేస్తున్నారు.
ఆపిల్ వినెగర్ అంటే ఏమిటీ?
ఆపిల్ పళ్ల రసం నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆపిల్ పళ్లరసానికి మంచి బ్యాక్టీరియాను, ఈస్ట్‌ను కలిపి పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. అనేక బ్రాండ్ కంపెనీలు వీటిని విక్రయిస్తున్నాయి. అత్యంత ఘాటుగా ఉంటుంది కనుక నేరుగా వినెగర్ తీసుకోలేనివారు సలాడ్స్‌పై వేసుకొని తినే అవకాశం కూడా ఉంది.