ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 100 ఏళ్ల తర్వాత

Australia Closes State Border For First Time In 100 Years Amid Covid 19 Spread - Sakshi

సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు వందేళ్ల తర్వాత న్యూ సౌత్‌ వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాల మధ్య మంగళవారం నుంచి సరిహద్దులను మూసివేయనుంది. ఈ విషయాన్ని విక్టోరియా ప్రీమియర్‌ డేనియల్‌ ఆండ్రూస్‌ సోమవారం వెల్లడించారు. విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో రోజు రోజుకీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాని స్కాట్‌ మెరిసన్‌, న్యూసౌత్‌వేల్స్‌ ప్రీమియర్‌ గ్లాడీస్‌ బెరెజిక్లియాన్‌తో సంప్రదించిన తర్వాతే సరిహద్దు మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా విక్టోరియాలో సోమవారం ఒక్కరోజే 127 కేసులు నమోదు కాగా.. ఒకరు కోవిడ్‌తో మృతిచెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 105కు చేరింది. (కోవిడ్‌-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!)

ఈ నేపథ్యంలో జూన్‌ మొదటివారంలో ఒక్క కేసు కూడా నమోదకాని విక్టోరియాలో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ నిబంధనలు కట్టుదిట్టం చేయడం సహా దాదాపు వందేళ్ల తర్వాత తొలిసారి విక్టోరియా- న్యూసౌత్‌ వేల్స్‌ సరిహద్దును మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి డేనియల్‌ మాట్లాడుతూ.. ‘‘ముందు జాగ్రత్త చర్యల్లో ఇదొకటి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. కాగా కరోనా వ్యాపించిన తొలినాళ్లలో ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేసినప్పటికీ విక్టోరియా- న్యూసౌత్‌వేల్స్‌ మాత్రం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే సిడ్నీ- మెల్‌బోర్న్‌ మధ్య మార్గాలు మూసుకుపోవడంతో భారీగా ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. కాగా ఇక స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో 1919లో తొలిసారి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు.(ర‌ష్యాను వెన‌క్కు నె‌ట్టేసిన‌ భార‌త్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top