‘గాంధీ మనకు వ్యతిరేకి.. విగ్రహాలు తీసేయండి’

African Student Association Demand to Remove Gandhi Statues - Sakshi

ఒట్టావా : జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమనించిన మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా కెనెడాలో ఉద్యమం మొదలైంది. ఆయన విగ్రహాలను తొలగించాలంటూ ఒట్టావాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నాలు చేపట్టగా.. క్రమక్రమంగా ఆ ఉద్యమం సోషల్‌ మీడియాలో పెను రూపం దాల్చింది. 

ఒట్టావాలోని కర్లెటోన్‌ యూనివర్సిటీలో ప్రముఖుల విగ్రహాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్యాంపస్‌ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలంటూ కొందరు నల్ల జాతీయ విద్యార్థులు ప్రతిపాదన చేశారు. దీనికి మద్ధతు ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ స్టూడెంట్‌ అసోషియేషన్‌(IASSA) అధ్యక్షుడు కెన్నెత్‌ అలియూ విస్తృతంగా ప్రచారం కల్పించాలంటూ పిలుపునిచ్చాడు. ‘గాంధీ నల్ల జాతి వ్యతిరేకి. అంత సముచిత స్థానం ఇవ్వటం సరికాదు. ఆఫ్రికాలో ఆయన వివక్షత ఎదుర్కున్నాడని.. అందుకే ఉద్యమం చేపట్టాడని కథలు చెబుతుంటారు. కానీ, అదంతా నిజం కాదు. స్వార్థ ప్రయోజనాలకే గాంధీ నల్ల జాతి ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యమాన్ని ఓ ఆయుధంగా వాడుకుని బ్రిటీష్‌ వాళ్లను బెదిరించాడు. దక్షిణాఫ్రికాలో అణచివేతకు గురవుతున్న భారతీయులను రక్షించుకునేందుకే గాంధీ అలా చేశారు. అలాంటి వ్యక్తిని ఇంతలా గౌరవించాల్సిన అవసరం మనకు లేదు’ అని కెన్నెత్‌ ఓ ప్రకటన విడుదల చేశాడు. 

అయితే యూనివర్సిటీ పరిపాలన విభాగం మాత్రం ఆ డిమాండ్‌కు విముఖత వ్యక్తం చేయగా.. పెద్ద ఎత్తున్న పోరాటం చేసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. కాగా, ఇదే అలియూ నేతృత్వంలో 2016లో ఘనా యూనివర్సిటీలోని గాంధీ విగ్రహాన్ని తొలగించాలంటూ ప్రయత్నాలు జరిగాయి. అయితే అది కూడా విఫలం కావటంతో మిగతా యూనివర్సిటీల చుట్టూ తిరుగుతూ నల్ల జాతి విద్యార్థులను రెచ్చగొడుతున్నాడంటూ పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top