
మరో అద్భుతం ఆవిష్కరణ!
ఓ రష్యా సైంటిస్ట్ సాంకేతికతను మెరుగుపరచి అరుదైన పుస్తకాన్ని రూపొందించాడు.
మనిషి తన మేధోశక్తితో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించాడు. సృజనాత్మకతతో ఎన్నో వింతలను సృష్టించాడు. ఊహకు అందని అరుదైన రికార్డులను లిఖించాడు. ఓ రష్యా సైంటిస్ట్ సాంకేతికతను మెరుగుపరచి అరుదైన పుస్తకాన్ని రూపొందించాడు.
సిబేరియా ప్రావిన్స్లోని నొవోసిబిర్క్కు చెందిన వ్లాదిమిర్ అనిస్కిన్ అనే శాస్త్రవేత్త అతిచిన్న పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ప్రపంచంలో ఇదే అతిచిన్న పుస్తకమని చెబుతున్నాడు. పరిశీలన కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు పంపనున్నాడు. ఈ మైక్రో బుక్ పేజీల కొలత 0.07 మిల్లీ మీటర్లు నుంచి 0.09 మిల్లీ మీటర్లు వరకు ఉంటుంది. దీన్ని తయారు చేయడం కోసం అవసరమయ్యే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి అనిస్కిన్కు ఐదు సంవత్సరాల సమయం పట్టింది. కాగా సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నెల రోజుల్లోనే రెండు వర్సెన్లను రూపొందించాడు. ఈ రెండు వర్సెన్లలో ఓ పుస్తకానికి లెవ్షా అని పేరు పెట్టాడు. ఇది 19వ శతాబ్ధంలో రష్యాలో ప్రఖ్యాత గాథ 'ది స్టీల్ ఫ్లీ'కు సంబంధించినది. ఇక రెండో పుస్తకం పేరు అల్ఫాబెట్. ఇది రష్యా అల్ఫాబెట్కు సంబంధించినది.
అనిస్కిన్ ఈ మైక్రో బుక్ను వాల్ కేలండర్ రూపంలో రూపొందించాడు. 3 నుంచి 4 మైక్రాన్ల మందం గల ఫిల్మ్ షీట్లపై లిథోగ్రఫీ (రాతి అచ్చు సంబంధమైన) పద్ధతి ప్రకారం అక్షరాలను ముద్రించినట్టు అనిస్కిన్ చెప్పాడు. అక్షరాలను ముద్రించడం కంటే ఈ పేజీలను పుస్తక రూపంలో బైండింగ్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని తెలిపాడు. పేజీకి ఇరువైపులా అక్షరాలుంటాయి. వీటిని నేరుగా చదవడానికి వీలుకాదు. సూక్ష్మ పరికరం సాయంతో వీటిని చదవవచ్చు.
గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో అతిచిన్న పుసక్తం తయారు చేసిన రికార్డు ఇప్పటివరకు జపనీస్ మాస్టర్స్ పేరిట ఉంది. దీన్ని 2003లో తయారు చేశారు. ఈ పుసక్తంతో పోలిస్తే అనిస్కిన్ తాజాగా తయారు చేసిన పుస్తక పరిణామం 88 రెట్లు తక్కువ.