కరోనాతో కకావికలం.. | 908 Members Died Due To Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనాతో కకావికలం..

Feb 11 2020 4:41 AM | Updated on Feb 11 2020 4:57 AM

908 Members Died Due To Corona Virus - Sakshi

బీజింగ్‌/టోక్యో/త్రిస్సూర్‌: చైనాలో ప్రమాదకర కరోనా వైరస్‌ వ్యాప్తి జనసమూహంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 908కి చేరుకుంది. వైరస్‌ సోకినట్లు నిర్ధారణైన కేసుల సంఖ్య 40వేలు మించినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం ఒక్కరోజే చైనాలో 97 మంది కరోనా వైరస్‌ కారణంగా మరణించారు. 3062 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. అయితే, చైనాలో గతంతో పోల్చితే రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఓ నివేదిక వెల్లడించింది. చైనాలో వ్యాధి కట్టడి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెవో) పంపిన అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందం సోమవారం బీజింగ్‌కు చేరుకుంది.

టోక్యో సముద్రతీరంలో లంగరేసి ఉన్న డైమండ్‌ ప్రిన్స్‌ క్రూయిజ్‌ నౌకలో మరో 65 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు సోమవారం వెల్లడైంది. దీంతో ఈ వ్యాధి బారిన పడిన నౌక ప్రయాణికుల సంఖ్య 130కి పెరిగింది. ఏఏ దేశాల వారికి వ్యాధి సోకిందో స్పష్టంగా తెలపలేదు. నౌకలోని భారతీయ సిబ్బంది, ప్రయాణికులకు సంబంధించిన అదనపు సమాచారం కోసం @IndianEmbTokyo, fscons. tokyo@mea.gov.in,  @CPVIndia,  @MEAIndia,@PMOIndia ట్విట్టర్‌ హ్యాండిళ్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చునని జపాన్‌ లోని భారతీయ దౌత్యకార్యాలయం తెలిపింది. కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాస్కు ధరించి బీజింగ్‌ నగరాన్ని సందర్శించారు. కరోనాను జయించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఒక లేఖ రాయడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పందించారు. కష్టకాలంలో అండగా నిలిచి నందుకు, సాయం అందిస్తామని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆమెకు కరోనా లేదట! 
భారత్‌లో మొదట కరోనా వైరస్‌ సోకిన వైద్య విద్యార్థిని దాని నుంచి కోలుకుంటున్నారు. తాజాగా ఆమెకు నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షల్లో ‘నెగిటివ్‌’ అని వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ‘త్రిస్సూర్‌ నుంచి మొదటి కరోనా కేసు అయిన ఆమె రక్త నమూనాను జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)కు పంపగా కరోనా వైరస్‌ లేదని వెల్లడైంది. అయినప్పటికీ ఎన్‌ఐవీ నుంచి రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం’అని సీనియర్‌ వైద్యాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,252 మందికి పైగా వ్యక్తుల్ని పరిశీలనలో ఉంచినట్లు వైద్య విభాగం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement