అమెరికాలో భారత విద్యార్థుల హవా

249000 Indian students in US varsities, says latest report - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్‌ విభాగం శుక్రవారం విడుదలచేసిన స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ నివేదిక ప్రకారం 2017లో అమెరికాలో 2,49,763 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ జాబితాలో 4,81,106 మంది విద్యార్థులతో చైనా తొలిస్థానంలో నిలవగా, దక్షిణకొరియా(95,701), సౌదీ అరేబియా(72,358), జపాన్‌(41,862) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక 24 నెలల గడువుండే సైన్స్‌–టెక్నాలజీ–ఇంజనీరింగ్‌–గణితం(స్టెమ్‌) ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)లో సైతం భారతీయ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఇమిగ్రేషన్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికాలో స్టెమ్‌ డిగ్రీ విద్యార్థులకు అదనంగా ఉండే ఈ కోర్సులో గతేడాది 89,839 మంది విదేశీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. వీరిలో భారతీయులు(53,507 మంది) తొలిస్థానంలో ఉండగా, చైనీయులు(21,705), దక్షిణకొరియా (1,670), తైవాన్‌(1,360), ఇరాన్‌(1,161) విద్యార్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు.

ట్రంప్‌పై విద్యా సంస్థల న్యాయపోరాటం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పరిపాలనా యంత్రాంగం వీసా విధానంలో చేపట్టిన మార్పులపై 4 అమెరికన్‌ విద్యాసంస్థలు దావా వేశాయి. ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారత్‌ సహా విదేశాల నుంచి తమ కళాశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుందని గుల్‌ఫోర్డ్‌ కాలేజ్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్, ది న్యూ స్కూల్, ఫుట్‌హిల్‌ డీ అన్జా కమ్యూనిటీ కాలేజ్, హెవర్‌ఫోర్డ్‌ కాలేజ్‌లు డిస్ట్రిక్‌ కోర్ట్‌ ఇన్‌ నార్త్‌ కరోలినాను ఆశ్రయించాయి.  ప్రపంచానికి విద్యా కేంద్రంగా భాసిల్లుతున్న అమెరికా తన ప్రాభవాన్ని కోల్పోతుందన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top