అక్రమంగా ఉంటున్న భారతీయులు @ 21వేలు

21 thousand Indians stayed in United States after visa expired - Sakshi

వీసా ముగిసినా యూఎస్‌ నుంచి తిరిగిరాని వైనం

వాషింగ్టన్‌: 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య కాలంలో వలసేతర వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయుల్లో 21 వేల మంది వీసా గడువు ముగిసినా అక్కడే అక్రమంగా ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) వెల్లడించింది. అమెరికాకు చట్టబద్ధంగా వచ్చి, అక్రమంగా ఉంటున్న వారి సంఖ్యపరంగా చూస్తే భారత్‌ టాప్‌–10 దేశాల్లో ఉంది. 2016 అక్టోబరు–2017 సెప్టెంబర్‌ కాలంలో అమెరికాకు వివిధ వీసాలపై వచ్చి వెళ్లిన వారి వివరాలను విశ్లేషిస్తూ డీహెచ్‌ఎస్‌ కొన్ని వివరాలు ప్రకటించింది.

ఈ ఏడాది కాలంలో అన్ని దేశాల నుంచి కలిపి దాదాపు 5.26 కోట్ల మంది అమెరికాకు వలసేతర వీసాల (వాణిజ్య, పర్యాటక తదితర వీసాలు)పై వచ్చారనీ, వారిలో దాదాపు ఏడు లక్షల మంది తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోయారని తేలింది. బీ–1, బీ–2 వీసాల వరకు చూస్తే ఏడాది కాలంలో మొత్తం 10.7 లక్షల మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించగా, వారిలో 12,498 మంది ఇప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉన్నారు. మరో 1,708 మంది వీసా గడువు ముగిశాక కొన్నాళ్లు ఉండి తర్వాత వెళ్లారని తేలింది. 2017లో వాయు, సముద్ర మార్గాల ద్వారా 5,26,56,022 మంది విదేశీయులు (శరణార్థులు కాకుండా) అమెరికాకు వచ్చారని  అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top