రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావులకు కాపు ఉద్యమం, ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి ధ్వజమెత్తింది.
మంత్రులు నారాయణ, గంటాపై నేతల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావులకు కాపు ఉద్యమం, ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి ధ్వజమెత్తింది. కాపులకు బీసీ హోదాపై ఆగస్టులో ప్రారంభించనున్న తుది పోరు సన్నాహాల్లో భాగంగా ముద్రగడ, ఆయన అనుచరులు సోమవారం పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామిక వేత్త తోట చంద్రశేఖర్, కాపునాడు నేతలు ఎంహెచ్‌రావు, కేవీ రావు, నోవా కృష్ణారావు, రాఘవేంద్రరావు, చందు జనార్ధన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు, ఎస్సీ సంఘం నేత బొంతు రాజేశ్వరరావు తదితరులను కలిసి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకులు ఆకుల రామకృష్ణ, చినమిల్లి రాయుడు, అమరనాథ్ తదితరులు మాట్లాడుతూ ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయాలను వినియోగించుకునేంత నీచ స్థాయిలో ముద్రగడ లేరని, ఆయన గురించి ఏమి తెలుసని మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్‌లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా మంత్రులు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ముద్రగడ చెప్పారు. ఈ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలమో.. వ్యతిరేకమో కాదన్నారు.