Ummareddi Venkateswarlu
-
ముగింపు లేని యుద్ధోన్మాదం
ట్రంప్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేయడం వారి విజ్ఞతకు నిదర్శనం. యుద్ధంలో గెలిచే శామనీ, ఇరాన్ లొంగిపోయిందనీ ట్రంప్ చేసిన ప్రకటనను మొదట్లో అందరూ నిజమేనని నమ్మారు. కానీ ఇరాన్ ప్రతిఘటన తీవ్రంగా ఉండటం, పెద్ద సంఖ్యలో అమెరి కన్ సైనికులు చనిపోవడం, హోర్మూజ్ జలసంధిని ఇరాన్ పరిరక్షించుకోవడం వంటి పరిణామాలు చూసిన తరువాత యుద్ధానికి సంబంధించి అధ్యక్షుడు తమకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని వారికి అర్థమైంది. ఇప్పటికే అమెరికాలో చమరు, గ్యాస్ ధరలు పెరిగాయి. తమ దేశం ఈ యుద్ధంలో అడ్డంగా ఇరుక్కుపోయిందనీ, దానినుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతున్నారనీ ప్రజలు గ్రహించారు. ‘ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఎన్నో ఏళ్లుగా వింటున్నాం. అలాగే అక్కడ ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తున్నారని కూడా విన్నాం. ఇప్పుడు నాకు అవేవీ వినబడటం లేదు. నా దేశంలో నేను కొనే గ్యాస్ (పెట్రోల్) ధర అమాంతం పెరిగిపోవడం ఒక్కటే నన్ను బాధిస్తోంది’ అని ‘బీబీసీ’ వార్తా సంస్థతో ఓ సగటు అమెరికన్ అనడం పరిస్థితికి అద్దం పడుతోంది. యుద్ధ విరమణ చేయించాలంటే తమకు భారీ ఎత్తున నష్టపరి హారం చెల్లించాల్సిందేనని ఇరాన్ షరతు విధించడం అమెరికాకు ఊహించని పరిణామం. ఇరాన్‌ను తక్కువగా అంచనా వేసి ఎదురు దెబ్బతిన్న నేపథ్యంలో, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న నిర్ణయం తనది కాదని చెప్పుకోవడానికి ట్రంప్ తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతా లలో కూడా ట్రంప్‌కు వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘నోకింగ్స్’ పేరుతో సాగుతున్న ఈ నిరసన జ్వాలలు యూరప్ నగరా లకు సైతం పాకాయి. భారత్ మాత్రం ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు... ట్రంప్‌కు మోదీ లొంగిపోయాడని విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాని సంయ మనం పాటిస్తున్నారు.స్వప్రయోజనాలే మిన్న ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింప జేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కొన్ని దేశాలు తమ సొంత ప్రయోజ నాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం మరో పార్శ్వం. హోర్మూజ్ జలసంధి నుంచి తమ రవాణా నౌకలు సజావుగా ప్రయా ణించడానికి సహకరించాలని ఇరాన్‌కు చైనా విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధంలో తమ పక్షాన నిలవాలని చైనాకు షరతు విధించింది. ప్రçస్తుతం చైనా కూడా తటస్థ వైఖరితోనే ఉంది. మరోవైపు ఇరాన్‌తో జరిపే చర్చలకు అమెరికా తమ దేశాన్ని వేదికగా చేసుకోవాలని కోరుతున్న పాకిస్తాన్ ఇరుపక్షాల నుండి లబ్ధి పొందాలని చూస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నట్లు పాకిస్తాన్ దళారీ పాత్ర పోషించి రెండు వైపులా లాభాలు పిండుకోవడానికి ఆరాటపడుతున్నది. ఇరాన్ కనుక హోర్మూజ్ జలసంధిని మూసివేసినట్లయితే భారత్ సహా పలు దేశాలు ఆర్థికంగా దెబ్బ తినడం ఖాయం. అందువల్ల ఇరాన్‌ను అమెరికాతో యుద్ధ విరమణ సంధికి ఒప్పించడానికి పశ్చిమాసియా, యూరప్ దేశాలు ఆతృత పడుతున్నాయి. ఇంగ్లాండ్‌లో ఆర్థిక పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అందువల్లనే ఆ దేశం కూడా వీలైనంత త్వరగా యుద్ధానికి స్వస్తి పలకాలని ట్రంప్‌కు సూచిస్తోంది.రష్యన్ మహా రచయిత టాల్‌స్టాయ్ చెప్పినట్లు, ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాకు రోజుకో బిలియన్ డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకులు, వారి కుటుంబ సభ్యులకు జరిగిన నష్టాన్ని లెక్కించడానికి ఏ కొలమానం ఉంది? ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అందుకే దాడి అని చెప్పిన ట్రంప్ మాటల్లోని డొల్లతనం కూడా ప్రపంచానికి అర్థమయ్యింది. ఇరాన్‌కు నిజంగానే అణ్వాయుధాలు ఉన్నట్లయితే వాటిని ఇంత కాలం ప్రయోగించకుండా ఉంటుందా? దేశ సార్వభౌమాధికారాన్ని ఎంత శక్తిమంతమైన దేశం ప్రశ్నించినా... చిన్న దేశాలు సహించవని చెప్పడానికి ఇరాన్ ఒక ఉదా హరణగా నిలుస్తుంది. గతంలో అమెరికాకు వియత్నాం, క్యూబాల నుంచి కూడా ఇటువంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయి. ఆ చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోని అమెరికన్ పాలకులు పదేపదే అవే తప్పులను చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధ నియ మాలను ఉల్లంఘిస్తూ వైరిపక్షాలు ఆడుతున్న ఈ వికృత క్రీడకు ఇప్పట్లో ముగింపు ఉంటుందా?డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు -
‘చంద్రబాబు హోదా తేలేని అసమర్థుడు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని అసమర్థుడని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి చంద్రబాబు, మోదీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఏపీకి హోదా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వంచనపై గర్జన దీక్షను టీడీపీ, బీజేపీ వంచనపై గర్జనగా అభివర్ణించారు. ఎంపీలందరూ రాజీనామా చేద్దామంటే టీడీపీ ఒప్పుకోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన సంగతిని గుర్తుచేశారు. హోదా కోసం ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు యూటర్న్‌పై పీడీ కేసు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు,విద్యార్థులు, డ్వాక్రామహిళలు సహా అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారని మండిపడ్డారు. -
మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు
మంత్రులు నారాయణ, గంటాపై నేతల ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావులకు కాపు ఉద్యమం, ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి ధ్వజమెత్తింది. కాపులకు బీసీ హోదాపై ఆగస్టులో ప్రారంభించనున్న తుది పోరు సన్నాహాల్లో భాగంగా ముద్రగడ, ఆయన అనుచరులు సోమవారం పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామిక వేత్త తోట చంద్రశేఖర్, కాపునాడు నేతలు ఎంహెచ్‌రావు, కేవీ రావు, నోవా కృష్ణారావు, రాఘవేంద్రరావు, చందు జనార్ధన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు, ఎస్సీ సంఘం నేత బొంతు రాజేశ్వరరావు తదితరులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకులు ఆకుల రామకృష్ణ, చినమిల్లి రాయుడు, అమరనాథ్ తదితరులు మాట్లాడుతూ ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయాలను వినియోగించుకునేంత నీచ స్థాయిలో ముద్రగడ లేరని, ఆయన గురించి ఏమి తెలుసని మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్‌లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా మంత్రులు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ముద్రగడ చెప్పారు. ఈ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలమో.. వ్యతిరేకమో కాదన్నారు. -
గొప్ప మానవతావాది
జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్సీపీ నివాళి సాక్షి, హైదరాబాద్: బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప మానవతావాదనీ, ఆయన ఆదర్శాలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నపుడే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొని జగ్జీవన్‌రామ్‌కు నివాళి ఘటించారు.ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ జగ్జీవన్ సేవలను శ్లాఘిం చారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్లు సమాజంలోని అట్టడుగువర్గాలందరి సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఇటీవల దళితుల్ని కించపర్చేలా వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు.. జగ్జీవన్‌రామ్ జయంతి రోజున ఎస్సీల పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.పార్టీ ఎస్సీ ఏపీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ తెలంగాణ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌లు కూడా ప్రసంగించారు.


