అనేక జబ్బులకు కారణం కాలుష్యమే | workshop on Air pollution in hyderabad attends scientist animita roy choudhary | Sakshi
Sakshi News home page

అనేక జబ్బులకు కారణం కాలుష్యమే

Oct 27 2016 3:51 AM | Updated on Sep 4 2017 6:23 PM

అనేక జబ్బులకు కారణం కాలుష్యమే

అనేక జబ్బులకు కారణం కాలుష్యమే

అనేక జబ్బులకు వాయుకాలుష్యమే కారణమవుతున్నట్లు శాస్త్రవేత్త అనుమిత రాయ్‌ చౌదరి స్పష్టం చేశారు.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌
    శాస్త్రవేత్త అనుమిత రాయ్‌ చౌదరి
దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యంపై వర్క్‌షాప్‌

సాక్షి, హైదరాబాద్‌:
వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల సమస్యలు మాత్రమే వస్తాయనుకుంటే అది పొరబాటేనని... మధుమేహం మొదలుకొని గుండెజబ్బులకు కూడా ఇది కారణమవుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) శాస్త్రవేత్త అనుమిత రాయ్‌ చౌదరి స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక ఇతర నగరాల్లోనూ వాయు కాలుష్యం సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ... పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్య తీవ్రతను అన్నికోణాల నుంచి అర్థం చేసుకోవడంతోపాటు పరిష్కార మార్గాలను కూడా సమగ్ర దృష్టితో చూడాల్సి ఉందని ఆమె హైదరాబాద్‌లో బుధవారం ‘అర్బన్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ చాలెంజెస్‌ ఇన్‌ సదరన్‌ రీజియన్‌’ పేరుతో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో తెలిపారు. దేశంలో దాదాపు పాతిక శాతం జనాభా నివసించే మహానగరాల్లోని వాయు కాలుష్యంపై సీఎస్‌ఈ మదింపు జరిపిందని, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన కాలుష్యం కొంచెం తక్కువగా ఉందని వివరించారు.

మహానగరాల్లో వాయుకాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పూర్తిస్థాయి వ్యవస్థలు లేకపోగా... వాతావరణంలో పరిమితికి మించి కాలుష్యం ఉంటే తక్షణం ఏం చేయాలన్న విషయంపై కూడా ఎలాంటి ప్రణాళిక లేదని తెలిపారు. చైనా రాజధాని బీజింగ్‌ విషయాన్ని తీసుకుంటే... వాయుకాలుష్యం ఒక పరిమితికి మించి ఉన్నట్లు తేలితే... అధికారులు వెంటనే పరిసరాల్లోని ఫ్యాక్టరీలను తాత్కాలికంగా నిలిపివేయడం, రోడ్లపైకి వచ్చే వాహనాలను నియంత్రించడం, బాణసంచా కాల్చడంపై పరిమితులు, నిషేధం విధించడం వంటి చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యం..
నగరాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, అనేక ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అనుమిత సూచించారు. పాదచారులు, సైకిల్‌ ద్వారా ప్రయాణించే వారిని ప్రోత్సహించేలా రహదారి డిజైన్లను మార్చాల్సి ఉంటుందని, రోడ్‌ క్రాసింగ్‌కు తగిన ఏర్పాట్లు లేకుంటే సమస్య మరింత జటిలమవుతుందేగానీ, పరిష్కారం మాత్రం కాదని స్పష్టం చేశారు.  ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు, ఫ్లై ఓవర్ల ద్వారా ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం కావని, కొన్ని సందర్బాల్లో మరింత పెరుగుతాయని అన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి, బేసి ప్రయోగం సాధించిన ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. అయితే చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను భారీ స్థాయిలో తగులబెట్టడం కూడా ఢిల్లీ వాతావరణంపై ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్య సమస్య పరిష్కారానికి ప్రాంతీయ స్థాయిలో మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎన్‌.రవీందర్, ఎం.శివారెడ్డిలతోపాటు కర్ణాటక, తమిళనాడు అధికారులు బి.ఎం.ప్రకాశ్, పి.ఎస్‌.లివింగ్‌స్టోన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement