ఆదాయాభివృద్ధే లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు | Women's fund loans aimed at redevelopment | Sakshi
Sakshi News home page

ఆదాయాభివృద్ధే లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు

Aug 28 2017 3:12 AM | Updated on Sep 17 2017 6:01 PM

ఆదాయాభివృద్ధే లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు

ఆదాయాభివృద్ధే లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు

ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చేందుకు తెలంగాణ స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య పెద్ద పీట వేస్తోంది.

మహిళలకు రూ.1,148 కోట్లు ఇచ్చిన సంస్థ
నివేదికలో వెల్లడించిన స్త్రీనిధి సమాఖ్య


సాక్షి, హైదరాబాద్‌:  ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చేందుకు తెలంగాణ స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య పెద్ద పీట వేస్తోంది. సగానికిపైగా రుణాలను ఈ తరహా కార్యక్రమాలకే ఇవ్వాలన్న రిజర్వుబ్యాంకు నిబంధనలకు మించి స్త్రీనిధి సంస్థ మంజూరు చేసింది. గత రెండేళ్లలో ఏనాడూ సగానికి తక్కువ ఇచ్చిన పరిస్థితి లేదని స్త్రీనిధి సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు స్త్రీనిధి సమాఖ్య ఒక నివేదికను విడుదల చేసింది.

2014–15లో స్త్రీనిధి బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు ఆదాయానికి కాకుండా ఇతర కార్యక్రమాల కోసం 27,793 మంది సభ్యులకు రూ.48.44 కోట్లు ఇస్తే, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కింద 2.43 లక్షల మందికి రూ. 654.85 కోట్లు (93.11%) రుణంగా ఇచ్చింది. 2015–16లో ఆదాయాభివృద్ధికి కాకుండా ఇతర కార్యక్రమాలకు 68,263 మంది సభ్యులకు రూ. 153.97 కోట్లు ఇవ్వగా, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకోసం 3.86 లక్షల మందికి రూ. 994.39 కోట్లు (86.59%) రుణంగా ఇచ్చినట్లు స్త్రీనిధి సమాఖ్య నివేదిక తెలిపింది. ఆదాయాభివృద్ధిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే అత్యధికంగా రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆదాయం రాని ఇతర కార్యక్రమాలకు ఇచ్చిన రుణాల్లో మహిళలు విద్య, ఆరోగ్యం, వివాహాల ఖర్చుల కోసం ఉపయోగించినట్లు నివేదిక తెలిపింది.

బీసీ మహిళలకు 57% రుణాలు...
స్త్రీనిధి ద్వారా ఇచ్చిన రుణాలు అత్యధికంగా బీసీ మహిళలకే దక్కడం గమనార్హం. 2015–16 లెక్కల ప్రకారం మొత్తం 4.57 లక్షల మంది సభ్యులు రూ.1,148.37 కోట్లమేర రుణాలు తీసుకున్నారు. అందులో 2.74 లక్షల మంది బీసీలకు రూ. 701.45 కోట్లు మంజూరు చేశారు. 60 శాతం బీసీ సభ్యులకు మొత్తం రుణాల్లో 57.60 శాతం అందజేసినట్లు నివేదిక తెలిపింది.

అప్పులు తీసుకున్న 90,608 ఎస్సీ మహిళా సభ్యులకు రూ. 221.52 కోట్లు అందజేశారు. అంటే 19.81 శాతమున్న ఎస్సీ సభ్యులకు మొత్తం రుణాల్లో 19.09 శాతం ఇచ్చారు. ఎస్టీ సభ్యులు 5.82 శాతముంటే 4.63 శాతం రుణాలు అందాయని సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. స్త్రీనిధి ఏర్పాటయ్యాక ఇప్పటివరకు దేశంలో ఏ సంస్థా చేయలేని విధంగా మహిళా సభ్యులకు సేవలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement