breaking news
Womens Fund Loans
-
పేద మహిళల పెన్నిధి ‘స్త్రీ నిధి’
ఏజీ వర్సిటీ: ‘దేశానికి స్త్రీ నిధి సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది. ఇది లక్షలాది మంది పేద మహిళల పెన్నిధి’అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో స్టేట్ బ్యాంకు తర్వాత అత్యధిక రుణాలిచ్చింది ఈ సంస్థేనని చెప్పారు. పదేళ్ల కిందట రూ.32 కోట్లతో మొదలై ఈ రోజు రూ.5,300 కోట్లకు చేరిందని, ఇది తెలంగాణలోని మహిళల ఘనతని అన్నారు. స్త్రీ నిధి ద్వారా ఇప్పటివరకు 3.97 లక్షల మహిళా సంఘాల్లోని 26.92 లక్షల మంది సభ్యులకు రూ.14,339 కోట్ల రుణాలిచ్చారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లు రుణాలుగా అందించారని చెప్పారు. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో ‘స్త్రీ నిధి’9వ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ‘గతంలో మహిళలకు డబ్బులు అవసరమైతే భర్తలను బతిమిలాడుకునే పరిస్థితి ఉండేది. ఇçప్పుడు భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఇందులో స్త్రీనిధి, సీఎం కేసీఆర్ పాత్ర ఎంతో ఉంది’అని ఎర్రబెల్లి అన్నారు. రుణాలివ్వడానికి బ్యాంకులు షూరిటీలు అడుగుతాయని, స్త్రీ నిధి వచ్చాక డ్వాక్రా సంఘాల మహిళలకు షూరిటీ లేకుండా అప్పులిస్తున్నారని చెప్పారు. అభయహస్తం నిధులను తిరిగి మహిళలకు ఇస్తామని, స్త్రీనిధి కమిటీ కాలపరిమితిని రెండేళ్లకు పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి స్త్రీ నిధి సంస్థకు ప్రత్యేక భవనాన్ని నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆదాయాభివృద్ధే లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు
► మహిళలకు రూ.1,148 కోట్లు ఇచ్చిన సంస్థ ► నివేదికలో వెల్లడించిన స్త్రీనిధి సమాఖ్య సాక్షి, హైదరాబాద్: ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చేందుకు తెలంగాణ స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య పెద్ద పీట వేస్తోంది. సగానికిపైగా రుణాలను ఈ తరహా కార్యక్రమాలకే ఇవ్వాలన్న రిజర్వుబ్యాంకు నిబంధనలకు మించి స్త్రీనిధి సంస్థ మంజూరు చేసింది. గత రెండేళ్లలో ఏనాడూ సగానికి తక్కువ ఇచ్చిన పరిస్థితి లేదని స్త్రీనిధి సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు స్త్రీనిధి సమాఖ్య ఒక నివేదికను విడుదల చేసింది. 2014–15లో స్త్రీనిధి బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు ఆదాయానికి కాకుండా ఇతర కార్యక్రమాల కోసం 27,793 మంది సభ్యులకు రూ.48.44 కోట్లు ఇస్తే, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కింద 2.43 లక్షల మందికి రూ. 654.85 కోట్లు (93.11%) రుణంగా ఇచ్చింది. 2015–16లో ఆదాయాభివృద్ధికి కాకుండా ఇతర కార్యక్రమాలకు 68,263 మంది సభ్యులకు రూ. 153.97 కోట్లు ఇవ్వగా, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకోసం 3.86 లక్షల మందికి రూ. 994.39 కోట్లు (86.59%) రుణంగా ఇచ్చినట్లు స్త్రీనిధి సమాఖ్య నివేదిక తెలిపింది. ఆదాయాభివృద్ధిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే అత్యధికంగా రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆదాయం రాని ఇతర కార్యక్రమాలకు ఇచ్చిన రుణాల్లో మహిళలు విద్య, ఆరోగ్యం, వివాహాల ఖర్చుల కోసం ఉపయోగించినట్లు నివేదిక తెలిపింది. బీసీ మహిళలకు 57% రుణాలు... స్త్రీనిధి ద్వారా ఇచ్చిన రుణాలు అత్యధికంగా బీసీ మహిళలకే దక్కడం గమనార్హం. 2015–16 లెక్కల ప్రకారం మొత్తం 4.57 లక్షల మంది సభ్యులు రూ.1,148.37 కోట్లమేర రుణాలు తీసుకున్నారు. అందులో 2.74 లక్షల మంది బీసీలకు రూ. 701.45 కోట్లు మంజూరు చేశారు. 60 శాతం బీసీ సభ్యులకు మొత్తం రుణాల్లో 57.60 శాతం అందజేసినట్లు నివేదిక తెలిపింది. అప్పులు తీసుకున్న 90,608 ఎస్సీ మహిళా సభ్యులకు రూ. 221.52 కోట్లు అందజేశారు. అంటే 19.81 శాతమున్న ఎస్సీ సభ్యులకు మొత్తం రుణాల్లో 19.09 శాతం ఇచ్చారు. ఎస్టీ సభ్యులు 5.82 శాతముంటే 4.63 శాతం రుణాలు అందాయని సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. స్త్రీనిధి ఏర్పాటయ్యాక ఇప్పటివరకు దేశంలో ఏ సంస్థా చేయలేని విధంగా మహిళా సభ్యులకు సేవలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.