ఈ ‘వజ్ర’o మాకొద్దు! | We dont need vajra buses | Sakshi
Sakshi News home page

ఈ ‘వజ్ర’o మాకొద్దు!

Sep 6 2017 8:30 AM | Updated on Sep 17 2017 6:26 PM

ఈ ‘వజ్ర’o మాకొద్దు!

ఈ ‘వజ్ర’o మాకొద్దు!

ప్రయాణికుల ఆదరణ లేక ఇప్పటివరకు విఫలయత్నంగానే మిగిలిన వజ్ర మినీ ఏసీ బస్సులకు కొత్త ఇబ్బంది వచ్చి పడింది.

- వజ్ర బస్సులపై డిపోల గగ్గోలు
నిర్వహించలేమంటూ ఆర్టీసీకి వేడుకోలు
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల ఆదరణ లేక ఇప్పటివరకు విఫలయత్నంగానే మిగిలిన వజ్ర మినీ ఏసీ బస్సులకు కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఆ బస్సులను తాము నిర్వహించలే మని, గ్రామీణ ప్రాంత డిపోలకు కేటాయించాలని వాటిని నిర్వహిస్తున్న 3 డిపోల అధికారులు చేతులెత్తేశారు. గత 3–4 నెలల్లో కొన్ని డిపోల్లో లాభాలు నమోదవడం.. మిగతా డిపోల పనితీరుపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్న తరుణంలో ఈ బస్సులు తమకు గుదిబండలుగా మారాయని వాపోతున్నారు. వజ్ర బస్సుల నష్టాలతో రేటింగ్స్‌లో వెనుకబడితే డిపోల పనితీరుకు మచ్చలా మిగులుతుందంటూ ఇటీవల విషయాన్ని యాజమాన్యానికి విన్నవించారు. 
 
40 శాతం దాటని ఆక్యుపెన్సీ..
హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు రాజధానిలోని కాలనీల మీదుగా నడిచేలా వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ.. తొలుత వరంగల్, నిజామాబాద్‌లకు 60 బస్సులు మొదలెట్టింది. మియాపూర్, కుషాయిగూడ, మెహిదీపట్నం డిపోలకు బస్సులను కేటాయించారు. యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవడం, మధ్యలో ఎక్కేవారికి టికెట్‌ ఇవ్వకపోవటం, ధర ఎక్కువగా ఉండటం.. వంటి కారణాలతో తొలి రోజు నుంచే ప్రయాణికులకు బస్సులు చేరువ కాలేకపోయాయి. ఈ లోపాలపై పత్రికల్లో కథనాలు రావటంతో మార్పులు చేసినా ప్రయాణికులు ఆదరించడం లేదు. వాటి ఆక్యుపెన్సీ రేషియో 40 శాతానికి కూడా చేరువ కాలేకపోయింది.
 
కిలోమీటరుకు రూ.తొమ్మిదే.. 
హైదరాబాద్‌లో ప్రతి కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) సగటున రూ.30 నుంచి రూ.32 మేర ఉంది. కానీ వజ్ర బస్సుల్లో రూ.9 వరకే పరిమితమైంది. డిపో ఆదాయంపై ఇది భారీ ప్రభావం చూపుతోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కొన్ని డిపోలు లాభాల బాటపట్టడంతో వరుస సమీక్షలతో డిపోల పనితీరును యాజమాన్యం పర్యవేక్షిస్తోంది. నష్టాలను అధిగమించటమే గీటురాయిగా పనితీరు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వజ్ర బస్సుల నష్టాలతో ర్యాంకిం గ్‌లో వెనుకబడిపోతున్నామని డిపోల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిటీ డిపోలు లాభాల్లో లేవని, గ్రామీణ డిపోలు లాభాల్లో ఉన్నందున నిజామాబాద్, వరంగల్‌ డిపోలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బస్సుల వల్ల ఏడాదికి రూ.5 కోట్లు నష్టమొస్తొందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. బస్సులను తమకు కేటాయించాలని వరంగల్‌ రీజియన్‌ అధికారులు గతంలో కోరినా, నగరంలోని కాలనీల మీదుగా నడపాలని సీఎం ఆదేశించటంతో సిటీకి కేటాయించారు. 
 
గరుడ కన్నా ఎక్కువే.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు రాజధాని బస్సు టికెట్‌ ధర రూ.280, గరుడ ధర రూ.350 ఉండగా.. వజ్ర బస్సు ధర రూ.380గా ఉంది. బస్సుల టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో ప్రజలు ‘వజ్ర’ వైపు మొగ్గు చూపటం లేదు. మరోవైపు బస్సులు నిర్వహించలేమంటూ డిపోలు గగ్గోలు పెడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement