
రాజ్యసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి
రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గురువారం ఉదయం తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారికి 4 సెట్ల నామినేషన్లు అందజేత
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గురువారం ఉదయం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకుని అక్కడ 11.45 నిమిషాలకు తన నామినేషన్‌ను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సత్యనారాయణ (ఏపీ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి)కు అందజేశారు. తొలి సెట్‌పై విజయసాయిరెడ్డి పేరును పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు.
కళత్తూరు నారాయణస్వామి, గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడుతో పాటు పది మంది ఎమ్మెల్యేలు దానిపై సంతకాలు చేశారు. మిగతా 3 సెట్లపై 30 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా సంతకాలు చేశారు. ఇటీవలి రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్రంగా గాయమైకోలుకుంటున్న విజయసాయిరెడ్డికి మద్దతుగా వైఎస్సార్‌ీసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇతర సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, శాసనమండలిలో పార్టీపక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కొడాలి నాని అసెంబ్లీ కార్యదర్శి చాంబర్‌లోనికి విజయసాయిరెడ్డితో వెళ్లి నామినేషన్లు వేయించారు.
ఏకగ్రీవంగా ఖరారు..
నామినేషన్‌కు దాఖలుకు ముందు విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతల సమావేశంలో ఏకగ్రీవంగా ఖరారు చేశా రు. ఉదయం 9 గంటలకు జరిగిన ఈ సమావేశంలో నేతలతో చర్చించిన తర్వాత విజయసాయిరెడ్డి పేరును వైఎస్ జగన్ అధికారికంగా అందరి సమక్షంలో ప్రకటించారు.