
రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరు ఖరారు అయింది.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరు ఖరారు అయింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సుదీర్ఘ భేటీ అనంతరం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు. విజయ సాయిరెడ్డి ఎంపిక పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపినవారికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
నామినేషన్ దాఖలు
అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి అసెంబ్లీకి వెళ్లిన విజయ సాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ విజయ సాయిరెడ్డి నామినేషన్ పత్రాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారాయణస్వామి, గిడ్డి ఈశ్వరి, ముత్యాల నాయుడు సంతకాలు చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, ఉప్పులేటి కల్పన,కొడాలి నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ...విజయసాయిరెడ్డిని ప్రతిపాదిస్తూ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు.