
చంద్రబాబు నిప్పు కాదు.. ఒళ్లంతా తుప్పే: వాసిరెడ్డి పద్మ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పు కాదని.. ఆయన ఒళ్లంతా తుప్పేనని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పు కాదని.. ఆయన ఒళ్లంతా తుప్పేనని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తనపై విచారణ నిలిపివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం తగదన్నారు. ఆయనకు దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలి తప్ప ఇలా దొడ్డిదోవన తప్పించుకోవడం సరికాదని చెప్పారు. ఆడియో టేపుల్లో 'మావాళ్లు.. దే బ్రీఫ్‌డ్ మీ' అన్న గొంతు చంద్రబాబుదేనన్న విషయం ఫోరెన్సిక్ పరీక్షలలో తేలిపోయిందని, ఆ టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదని ఆమె తెలిపారు.
చట్టం ముందు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని అన్నారు. చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాటలు బయటపడిన తర్వాత కూడా కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని అన్నారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి లాంటివాళ్లు చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేరని మాత్రమే చెబుతున్నారు తప్ప ఆయన ముద్దాయి కాదని అనడం లేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఆయన విచారణకు సిద్ధం కావాలని సవాలు చేశారు. ఇంతకుముందు కూడా పలు కేసుల విషయంలో కోర్టులకెళ్లి స్టే తెచ్చుకున్నారు తప్ప ఇప్పటివరకు ఒక్క విచారణను కూడా నేరుగా ఎదుర్కోలేదని వాసిరెడ్డి పద్మ చెప్పారు.