పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు అంతర్గత కొట్లాటలు తప్పుడు సంకేతాలను ఇస్తాయి.
దానం, మల్లేశ్‌లను మందలించిన ఉత్తమ్, భట్టి
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు అంతర్గత కొట్లాటలు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, ఇష్టాయిష్టాలకు అతీతంగా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో తన్నులాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీదా ఉంది’ అని కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ విషయంలో జరిగిన కొట్లాట నేపథ్యంలో వీరిద్దరితో ఉత్తమ్, భట్టి బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు వస్తున్న తరుణంలో సరిహద్దులంటూ వివాదం చేయడం, భౌతికదాడులకు దిగడం తప్పుడు సంకేతాలను ఇస్తాయన్నారు. భవిష్యత్తులో ఎవరూ, ఎవరితోనూ ఘర్షణ పడొద్దని, ఇకపై అలాంటివి మళ్లీ జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.