మాకివ్వండి...ఐదుకోట్లు ఎక్కువిస్తాం | Three companies offer to the government | Sakshi
Sakshi News home page

మాకివ్వండి...ఐదుకోట్లు ఎక్కువిస్తాం

Jul 21 2016 1:17 AM | Updated on Aug 31 2018 8:31 PM

మాకివ్వండి...ఐదుకోట్లు ఎక్కువిస్తాం - Sakshi

మాకివ్వండి...ఐదుకోట్లు ఎక్కువిస్తాం

సదావర్తి సత్రం భూముల కుంభకోణంలో కీలకపరిణామం చోటు చేసుకుంది.

- ప్రభుత్వానికి మూడు సంస్థల ప్రతిపాదన
- సదావర్తి భూముల వ్యవహారంలో కీలకపరిణామం
- ఆ ప్రతిపాదనల గురించి బైటపెట్టని రాష్ర్టప్రభుత్వం
- ఎక్కువ వస్తే భూములిచ్చేస్తామని గతంలో హైకోర్టులో ఒప్పుకున్న సర్కారు
 
 సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల కుంభకోణంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇష్టారాజ్యంగా దేవుడి భూములను కొట్టేద్దామనుకున్న ప్రభుత్వ పెద్దలకు గట్టి షాక్ తగిలింది. సదావర్తి భూములను తమకివ్వాలని, వేలం ధరకన్నా రూ. ఐదు కోట్లు అదనంగా చెల్లిస్తామని మూడు సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన మూడు ప్రముఖ సంస్థలు ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం.

అయితే ఆ ప్రతిపాదనల గురించి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు లేదా అధికారులు గానీ బైటపెట్టకపోవడం విశేషం. సదావర్తి భూముల కుంభకోణం బట్టబయలై విమర్శలు చెలరేగడంతో వేలంలో వచ్చిన మొత్తం కన్నా ఒక్కరూపాయి అదనంగా వచ్చినా ఆ భూములను వారికి అప్పగిస్తామని రాష్ర్టప్రభుత్వం సవాలు చేసిన సంగతి తెల్సిందే. ఐదుకోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని మూడు సంస్థలు ముందుకు రావడంతో ఇపుడు రాష్ర్టప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని అధికారవర్గాలంటున్నాయి.

 హైకోర్టులోనూ ఒప్పుకున్న ప్రభుత్వం...
గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సమీపంలో ఉన్న  వెయ్యి కోట్లకు పైగా విలువైన  83.11 ఎకరాల భూములను కేవలం రూ. 22.44 కోట్లకే  టీడీపీ నేత రామానుజయ కుటుంబసభ్యులు, వారి మిత్రబృందానికి అప్పజేప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకన్నా ఎక్కువ ధర చెల్లించడానికి ఎవరైనా ముందుకొస్తే ఆ భూములకు తిరిగి వేలం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల ప్రకటించారు. టీడీపీ నేత కుటుంబ సభ్యులు, వారి మిత్రబృందం ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లిస్తామన్న మొత్తానికి అదనంగా మరో ఐదు కోట్లు ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే వారికి ఆ భూములను అప్పగించడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరుఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు కూడా తెలియజేశారు. ప్రభుత్వ ప్రకటన నేపధ్యంలో రూ. 22.44 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు సత్రం భూములకు చెల్లించడానికి తమ ఆసక్తిని తెలియజేస్తూ 3 సంస్థలు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను పంపించాయి.

 అధికారుల్లో తర్జన భర్జన
 సదావర్తి సత్రం భూముల కుంభకోణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అధికారవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేలం నిర్వహించడమే కాక ఆ వేలంలో వచ్చిన మొత్తం కన్నా అదనంగా ఎవరన్నా ఎక్కువిస్తే భూములు అప్పగిస్తామని సవాలు చేసి రాష్ర్టప్రభుత్వం ఇరుక్కుపోయిందని అధికారవర్గాలంటున్నాయి. రాష్ర్టప్రభుత్వం సాక్షాత్తూ హైకోర్టులో ఒప్పుకోవడం, మంత్రి, ముఖ్యమంత్రి పత్రికా సమావేశాలలో పలుమార్లు సవాలు చేశారు. బుధవారం కూడా ముఖ్యమంత్రి రూ. 5 కోట్లు అదనంగా ఇచ్చేవారికి సదావర్తి భూములు ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దాంతో ఇపుడు అదనంగా చెల్లించడానికి ముందుకొచ్చిన సంస్థలలో దేనికో ఒక దానికి ఆ భూములు అప్పగించక తప్పని పరిస్థితి తలెత్తిందని దేవాదాయ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

 దేవుని భూములు కాపాడడం కోసమే..
 ప్రజల ఆస్తులను, దేవుడి మాన్యాలను కాపాడాల్సిన రాష్ర్టప్రభుత్వం ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడమే కాక వాటిని ఎడాపెడా కైంకర్యం చేస్తోందని, సదావర్తి భూముల వ్యవహారం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దేవుని భూములను కాపాడడం కోసమే తమ సంస్థ రంగంలోకి దిగిందని, రాష్ర్టప్రభుత్వం సవాల్ చేసినట్లుగా రూ. 5 కోట్లు అదనంగా చెల్లించడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆ ప్రతినిధి తెలిపారు. తాము రాష్ర్టప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన ప్రతులను గవర్నర్‌కు, ఇంకా సంబంధిత అధికారులందరికీ పంపించినట్లు వివరించారు.
 
 ఐదుకోట్లు ఎక్కువిస్తే ఇచ్చేస్తాం : సీఎం
 సదావర్తి భూములపై వేలంలో వచ్చిన రూ. 22 కోట్లు కన్నా రూ. 5 కోట్లు ఎక్కువ ఎవరిస్తే వారికే ఆ భూములు ఇచ్చేస్తామని  సీఎం చంద్రబాబు  అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. సదావర్తి భూములపై రూ.900 కోట్లు వస్తాయంటున్నారని అందులో ఒక శాతం అదనంగా ఇచ్చినా భూములు వారికిచ్చేస్తామని చెప్పారు. ఈ వార్తలు రాసిన వారికి లీగల్ నోటీసులిచ్చి ప్రాసిక్యూట్ చేయాల్సి వుంటుందని హెచ్చరించారు. తాము వేలం వేసిన సొమ్ము కంటె ఐదు కోట్లు ఎక్కువిస్తే ఎవరికైనా ఆ భూములిచ్చేస్తామన్నారు. ఆ భూములు ఆక్రమణలో ఉన్నాయని, దాని డాక్యుమెంట్ లేదని అందుకే అవి తమవనుకుంటున్నామని ఇష్టమైతే కొనుక్కోమని కమ్‌ఫర్ట్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీనిపై ఇష్టప్రకారం రాస్తున్నారన్నారు. అయితే రూ. 5 కోట్లు అదనంగా ఇస్తే ఇచ్చేస్తామని ఒకసారి, రూ. 900 కోట్లలో ఒకశాతం అదనంగా ఇస్తే ఇచ్చేస్తామని మరోసారి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement