
ఉనికి ప్రమాదంలో పడిందనే..
తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో తమ ఉనికి ప్రమాదంలో పడిందనే ఆందోళనతోనే ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలకు దిగుతున్నాయని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
విపక్షాల విమర్శలపై ఎంపీ కవిత
♦ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్, టీడీపీ పారిపోయూయని ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో తమ ఉనికి ప్రమాదంలో పడిందనే ఆందోళనతోనే ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలకు దిగుతున్నాయని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణలో రాజకీయంగా తమ పార్టీలకు స్థానం ఉండదని భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో కవిత విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అన్ని పక్షాలకు చర్చించే అవకాశం ఉంటుందని సీఎం ప్రకటించినా.. కాంగ్రెస్, టీడీపీలు పారిపోయాయని ఎద్దేవా చేశారు.
పరీక్షలకు హాజరుకాకుండా సాకులు చెప్పే విద్యార్థుల్లా చర్చలో పాల్గొనలేక పారిపోయారని విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టుకు ఎంత ఇచ్చిందని, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నిసార్లు మాట్లాడిందని ప్రశ్నించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) తూములను రాయలసీమకు చెంది న టీడీపీ నేతలు బద్దలు కొడుతుంటే ఆనాడు అదే పార్టీలో ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఎటుపోయారని, తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వనప్పుడు ఏం చేశారని కవిత నిలదీశారు.
తెలంగాణ ప్రాజెక్టులతో ఆటలాడకండి
వందేళ్ల చరిత్రను అధ్యయనం చేస్తే.. ప్రతి మూడేళ్లకోసారి తెలంగాణలో కరువు వస్తుం దని, దాహం వేసినప్పుడే బావితవ్వాలనే కాంగ్రెస్ విధానం వల్ల ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని కవిత విమర్శించారు. ‘‘ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినా, కాంగ్రెస్ హ యాంలోలాగా అది మొబిలైజేషన్ అడ్వాన్సు ల రూపంలో నేతల జేబుల్లోకి వెళ్లదు. ప్రతి పైసా ప్రజలకు చేరుతుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ నేతల విమర్శలు సరికాదు. తెలంగాణ ప్రాజెక్టులతో ఆటలాడవద్దు’’ అని హితవు పలికారు. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్కకు తాము సవాలు చేస్తున్నామని.. కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌లో లోపమేమిటో చెబితే చర్చకు తాము సిద్ధమ న్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక ముందు చూస్తూ ఊరుకోమని, కేసులు పెడతామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తలకు బీమా సౌకర్యం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది టీఆర్‌ఎస్ క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి రెండో ఏడాది కూడా వీరి బీమా పాలసీని రెన్యువల్ చేశామని, దీనికోసం రూ. 5.43 కోట్ల ప్రీమియం మొత్తాన్ని నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీకి చెల్లించామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 2లక్షల బీమా మొత్తం అందేలా చూసిందని చెప్పారు. కాగా, ఎంపీ కవిత ఈ ఏడాది బీమా రెన్యువల్ కోసం రూ. 5,43,87,500 మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 13 మంది కార్యకర్తలకు రూ. 26 లక్షల చెక్కును ఆ జిల్లా అధ్యక్షుడు బేగ్‌కు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కార్యకర్తలు ఏడుగురికి రూ. 14 లక్షల బీమా సొమ్ము చెక్కును నియోజకవర్గ ఇన్ చార్జి అమరేందర్‌రెడ్డికి కవిత అందజే శారు.