పంచాయతీల్లో ఆపరేటర్లకు పొంచి ఉన్న గండం | The operators of the danger posed to the panchayats | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో ఆపరేటర్లకు పొంచి ఉన్న గండం

Mar 27 2016 4:57 AM | Updated on Sep 3 2017 8:38 PM

పంచాయతీరాజ్ విభాగంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు గండం ఏర్పడింది.

♦ నెలాఖరుతో ముగియనున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ గడువు
♦ 1,313 మంది డేటా ఎంట్రీ
♦ ఆపరేటర్లలో ఆందోళన కొనసాగింపు విషయమై త్వరలో ఉత్తర్వులు: డెరైక్టర్
 
 సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ విభాగంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. గ్రామ పంచాయతీల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు 2014లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన వీరందరినీ ప్రభుత్వం నియమించింది. కార్వీ ఏజెన్సీతో సర్కారు కుదుర్చుకున్న ఒప్పందం గత డిసెంబరు 31తోనే ముగియగా, చివరి నిమిషంలోప్రభుత్వం మరో మూడు నెలల పాటు (2016 మార్చి 31) వరకు కాంట్రాక్ట్ గడువును పొడిగించింది. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయోనని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి కార్వే ఏజెన్సీ కింద ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వీరందరిని వదిలించుకోవాలని, కార్వే కాంట్రాక్ట్‌కు మంగళం పాడాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 తర్వాత సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’కోసం విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్‌లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని పంచాయతీరాజ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు.

 కొనసాగిస్తాం: పీఆర్ విభాగం డెరైక్టర్
 డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తామని, వారు పనిచేస్తున్న కార్వీ ఏజె న్సీ కాంట్రాక్ట్ గడువును మాత్రం పొడిగించడం లేదని పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్  అనితా రాంచంద్రన్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల ఆదాయంలో 10 శాతం నిధులను పరిపాలనకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను ఆ పంచాయతీలే  చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీచేస్తామని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement