లాస్ట్‌ డే.. మనదే! | The end of the Lakme Fashion Week | Sakshi
Sakshi News home page

లాస్ట్‌ డే.. మనదే!

Feb 6 2017 12:44 AM | Updated on May 24 2018 2:36 PM

లాస్ట్‌ డే..   మనదే! - Sakshi

లాస్ట్‌ డే.. మనదే!

దేశంలోనే ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ పండగలో సిటీ డిజైన్లు ధగధగ మెరిశాయి.

ముగిసిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌

దేశంలోనే ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ పండగలో సిటీ డిజైన్లు ధగధగ మెరిశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ఆరుగురు సిటీ డిజైనర్లు లాక్మే వేదికపై సత్తా చాటారు. ఆదివారం ఒకే రోజున సిటీ డిజైనర్ల ప్రదర్శనలు ఉండడంతో నగర ఫ్యాషన్‌ రంగ నిపుణులు, ఫ్యాషన్‌ ప్రియులు ముంబైలోని జియోగార్డెన్స్‌కు తరలివచ్చారు. దీంతో లాక్మే లాస్ట్‌ డే సిటీదే అన్నట్టు మారిపోయింది. – సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

సుష్మితానందం..
సిటీ డిజైనర్‌ శశి వంగపల్లి తొలి అడుగుతోనే లాక్మే వేదికను అబ్బురపరిచారు. ‘బిదారియా’ పేరిట తన వినూత్న డిజైన్లతో ఆమె ఫ్యాషన్‌ వీక్‌ చివరి రోజు 6డిగ్రీస్‌ స్టూడియోలో నిర్వహించిన షోలో ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు. లాక్మే అరంగేట్రంలోనే మాజీ మిస్‌ యూనివర్స్, బాలీవుడ్‌ నటి సుష్మితాసేన్‌ను షో స్టాపర్‌గా ర్యాంప్‌ వాక్‌ చేయించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సుష్మితాసేన్‌ మాట్లాడుతూ.. ‘శశి వంగపల్లి డిజైన్లు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అందుకే షో స్టాపర్‌గా వ్యవహరించాన’ని చెప్పారు. యువ డిజైనర్లను ప్రోత్సహించడంలో తాను ముందుంటానన్నారు. తన తొలి లాక్మే ఈవెంట్‌ విజయవంతమైనందుకు శశి సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణాది డిజైనర్ల సత్తాను, ముఖ్యంగా హైదరాబాద్‌ డిజైనర్ల ప్రతిభను ఇలాంటి వేదికలపై తెలియజేయడం ఆనందాన్నిస్తోందన్నారు.

గ్లామర్‌కు ‘దిశ’..
యంగ్‌ బ్యూటీ దిశాపఠాని లాక్మే ర్యాంప్‌పై మెరుపులు మెరిపించింది. ‘లోఫర్‌’ సినిమాతో మనకు పరిచయమైన దిశ.. సిటీ డిజైనర్‌ జయంతిరెడ్డికి షో స్టాపర్‌గా వ్యవహరించారు. రెండోసారి లాక్మేలో పాల్గొన్న జయంతి... వినూత్న డిజైన్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తాజా కలెక్షన్లు వేసవిలో ధరించేందుకు సౌకర్యంగా ఉంటాయన్నారు. అదే విధంగా ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించానన్నారు. తన కలెక్షన్లకు మరింత వన్నె తేవడంలో దిశను మించిన వారెవరూ కనపించలేదని, అందుకే ఆమెను షో స్టాపర్‌గా ఎంచుకున్నానన్నారు.

కెవ్వు కేక.. మలైకా
‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో కెవ్వు కేక పెట్టించిన మలైకా అరోరా లాక్మే ర్యాంప్‌పై మెరిశారు. ముద్దులు విసిరారు. అభిమానులను అలరించారు. నగరానికి చెందిన డిజైనర్‌ దివ్యారెడ్డి రన్‌వే ప్రాంగణంలో నిర్వహించిన ఫ్యాషన్‌ ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యారెడ్డి మాట్లాడుతూ తన కలెక్షన్‌ ఆదిలాబాద్‌ తదితర మారుమూల ప్రాంతాల్లోని చేనేత కళాకారుల పనితీరుకు నిదర్శనమన్నారు. కొండపత్తి అనే ప్రత్యేకమైన మెటీరియల్‌ను సేకరించి ఫ్యాబ్రిక్‌లో భాగం చేశామని వివరించారు. గతంలోనూ లాక్మేలో షో ఇచ్చిన దివ్య.. మరోసారి తన డిజైన్లతో వావ్‌ అనిపించారు.

సమ్మర్‌... సూపర్‌
సమ్మర్‌ సీజన్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించాలని, వేసవి తాపాన్ని ఎదుర్కోవాలని అనుకునే వారికోసం పాశ్చాత్యశైలి దుస్తులను డిజైన్‌ చేసిన అనుశ్రీరెడ్డి తన డిజైన్లతో ఆహూతులను ఆకట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా లాక్మేకు నగరం నుంచి ఆస్థాన డిజైనర్‌గా మారిన అనుశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతర శ్రమతోనే తానీ స్థాయికి వచ్చానన్నారు.  

సూపర్‌ ‘ద్వయం’..
నగరానికి చెందిన డిజైనర్‌ ద్వయం

రామ్జ్‌ప్రియాంకలు సైతం తొలి అడుగులోనే లాక్మేలో తమదైన ముద్ర వేశారు. లాక్మే చివరి రోజు తమ డిజైన్లను ప్రదర్శించిన వీరు పురుషుల దుస్తులను ఆకర్షణీయమైన రీతిలో ప్రదర్శించారు. వేసవి సీజన్‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న వీరి డిజైన్లకు స్పందన లభించింది.

టాప్‌ లేపిన టబూ..
నగర డిజైనర్‌ గౌరంగ్‌ షా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ఆఖరి రోజు తనదైన షోతో ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేశాడు. హైదరాబాదీ షాయిరీలను, ఇక్కడి గాయకుడు ఇక్బాల్‌పట్టిని ఎంచుకున్న ఆయన సిటీ బ్యూటీ టబూను షో స్టాపర్‌గా ర్యాంప్‌ వాక్‌ చేయించి అసలుసిసలు హైదరాబాదీ పరిమళాన్ని వెదజల్లాడు. మహిళా ప్రాధాన్యతను తెలిపే కవిత్వం తప్ప.. మరే ఆడంబర సంగీతానికి తావివ్వకుండా ఆయన చేసిన వినూత్న ప్రయత్నం ఆహూతులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టబూ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపుదిద్దిన, చేనేతల పనితీరుకు పట్టం గట్టిన చీర తనకెంతో నచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement