చారిత్రక కట్టడాలు కనుమరుగు!

చారిత్రక కట్టడాలు కనుమరుగు!


♦ సుల్తాన్ బజార్‌లో మెట్రో పనులకు శ్రీకారం

♦ కాలగర్భంలో కలిసిపోనున్న     చారిత్రకకట్టడాలు

♦ వాటిలో ముఖ్యమైనవి సుల్తాన్‌బజార్, బడీచౌడి మార్కెట్

♦ ఆర్యసమాజ్, హరి మసీద్, జైన్‌మందిర్‌లు కూడా...

 

 హైదరాబాద్: రాష్ర్టంలోనే ప్రతిష్టాత్మక చారిత్రక సుల్తాన్‌బజార్ మార్కెట్ త్వరలో కనుమరుగుకానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మెట్రోైరెల్ ప్రాజెక్ట్ మార్గం ఈ మార్కెట్ మీదుగానే వెళుతుండడంతో ఈ ప్రాంతంలో వందేళ్లు పైబడిన అరుదైనచారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. మెట్రో మార్గంపై స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా..హెచ్‌ఎంఆర్‌ఎల్, జీహెచ్‌ఎంసీ, ఎల్‌అండ్‌టీ సంస్థలు తమదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆస్తుల కూల్చివేతను గణనీయంగా తగ్గించేందుకు ఈ మార్కెట్ ప్రాంతంలో ప్రధాన రహదారి పైనుంచి 65 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఆస్తులను సేకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా గత మంగళవారం పుత్లిబౌలి చౌరస్తాలోని ఓ పెట్రోల్‌బంక్ కూల్చివేతతో సుల్తాన్ బజార్‌లో మెట్రో పనులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే.



 కాలగర్భంలోకి...

 సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో మార్గం వెళుతుండడంతో సుల్తాన్‌బజార్, బడీచౌడి ప్రాంతాల్లో సుమారు 60 నిర్మాణాలు నేలమట్టం కానున్నాయి. ఇందులో ప్రధానంగా 100 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక ఆర్యసమాజ్ మందిరం, హనుమాన్, గణపతి దేవాలయాలు, హరి మసీద్, సుల్తాన్‌బజార్ ప్రధాన మార్కెట్‌లో ఉన్న జైన్ మందిర్‌లతో పాటు ఆంధ్రాబ్యాంక్.. ఇతర ఆస్తులు కనుమరుగు కానున్నాయి. ముఖ్యంగా సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కె ట్, బడీచౌడి మార్కెట్, ఆర్యసమాజ్, హరి మసీద్, జైన్ మందిర్‌లు కూల్చివేతకు గురవుతుండడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.కోఠిలో రద్దీ దృష్ట్యా ప్రజల సౌకర్యార్ధం నిర్మించిన సబ్‌వేలు సైతం కనుమరుగయ్యే అవకాశం ఉంది.



 మెట్రోకు వ్యతిరేకంగా ఉద్యమం...

 తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులతో బహిరంగ సభ నిర్వహించి మెట్రో మార్గాన్ని సుల్తాన్‌బజార్ మీదుగా రానివ్వబోమని వ్యాపారులకు భరోసా ఇచ్చారు. దీంతో మెట్రో అధికారులు ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే నాలుగు రోజుల క్రితం అధికారులు పెట్రోల్ బంక్‌ను కూల్చివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.



 పరిహారం రెట్టింపు...

 నాలుగేళ్ల్ల క్రితం సుల్తాన్‌బజార్‌లో మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులు ఆందోళన చేపట్టిన రోజుల్లో గజానికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తామని వ్యాపారులతో మెట్రో అధికారులు సంప్రదింపులు జరిపినా సఫలంకాలేదు. మెట్రో కారిడార్ 1, 2లో పనులు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో సుల్తాన్‌బజార్ వ్యాపారులకు రెట్టింపు పరిహారం అంటే.. గజానికి లక్ష ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని కొందరు భవన యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగుతుండడం విశేషం. అయినా కొందరు వ్యాపారులు, హాకర్స్, 54 మంది భవన యజమానులు మెట్రో మార్గాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top