గ్రూప్-2కు కొత్త నోటిఫికేషన్! | Sakshi
Sakshi News home page

గ్రూప్-2కు కొత్త నోటిఫికేషన్!

Published Thu, Jul 28 2016 1:32 AM

గ్రూప్-2కు కొత్త నోటిఫికేషన్!

మొత్తం పోస్టులకు ఒకే నోటిఫికేషన్
 జారీకి టీఎస్‌పీఎస్సీ యోచన
అనుబంధ నోటిఫికేషన్‌కు గరిష్ట
వయోపరిమితి చిక్కులు
ఆచితూచి నిర్ణయం తీసుకోనున్న అధికారులు
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం

 
హైదరాబాద్:
గ్రూప్-2 పోస్టుల భర్తీపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. కొత్తగా అనుమతించిన 593 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలా.. లేక గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మొత్తం పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలా అన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే గరిష్ట వయో పరిమితి అంశంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
 
వయో పరిమితి చిక్కులు:
ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని ప్రభుత్వం పదేళ్లపాటు సడలించిన విషయం తెలిసిందే. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన నియామకం చేపట్టే ఉద్యోగాలకు ప్రస్తుతమున్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచారు. దాంతో గతేడాది గ్రూప్-2 నోటిఫికేషన్ సమయానికి గరిష్ట వయసున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు తక్కువగా ఉన్నాయని మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు. అయితే తాజాగా ప్రకటించిన 593 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే ఈ గరిష్ట వయో పరిమితితో చిక్కులు తలెత్తనున్నాయి. ఎందుకంటే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తే.. అది జారీ చేసే తేదీ నాటికి గరిష్ట వయో పరిమితిని లెక్కిస్తారు.

అంటే వివిధ కారణాల వల్ల గతేడాది ప్రధాన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన 44 ఏళ్ల వయసున్న అభ్యర్థులు.. ఇప్పుడు వారి వయసు 45కు చేరడంతో అనుబంధ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోలేరు. మరోవైపు తొలి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న 44 ఏళ్ల వారికి ఇప్పుడు 45 ఏళ్లు వచ్చినా.. అప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు అవకాశం అందని గరిష్ట వయసున్న అభ్యర్థులు దీనిపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇది మరిన్ని సమస్యలకు కారణమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల గత నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసి.. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తే చిక్కులుండవని భావిస్తున్నాయి.
 
మరో ఏడాది సడలింపు!

వయో పరిమితిపై వివాదాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా సడలింపును 11 ఏళ్లకు పెంచాలనే వాదనలున్నాయి. దాంతో తొలి నోటిఫికేషన్‌కు అర్హులైన వారందరూ అనుబంధ నోటిఫికేషన్‌కు అర్హులవుతారనే అభిప్రాయం వస్తోంది. మొత్తంగా గ్రూప్-2 కొత్త పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ఎలాంటి పద్ధతిని అనుసరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. దీంతో కొత్త నోటిఫికేషన్ సెప్టెంబర్‌లో వెలువడే అవకాశమున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ విభాగాల నుంచి ఇంకా పూర్తిగా వివరాలు అందలేదని, అందువల్ల ఆలస్యమవుతుందని సూచనప్రాయంగా వెల్లడించాయి.

Advertisement
Advertisement