ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్‌ | Stifund to Private PG students | Sakshi
Sakshi News home page

ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్‌

May 22 2017 12:30 AM | Updated on Oct 9 2018 7:39 PM

ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్‌ - Sakshi

ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్‌

పీజీ వైద్య విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్‌ ఇవ్వాలన్న నిబంధనను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) తప్పనిసరి చేసింది.

- కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా ఇవ్వాలి
- మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలు


సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్‌ ఇవ్వాలన్న నిబంధనను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) తప్పనిసరి చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో స్టైఫండ్‌ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు సరిగా అమలు చేయలేదు. దీనిపై ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎంసీఐ చివరకు సీరియస్‌గా ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా ఈ ఏడాది నుంచి సై్టఫండ్‌ ఇవ్వకపోతే ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

అందుకే ఫీజుల పెంపు...
స్టైఫండ్‌ ఇవ్వాలన్న నిబంధన నేపథ్యంలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కోరినట్లుగా ఫీజులు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీలకు మధ్య జరిగిన చర్చల్లోనూ ఇదే ప్రధాన అంశంగా ఉంది. తమకు వచ్చే ఫీజులు ఏమాత్రం చాలవని యాజమాన్యాలు ప్రభుత్వం వద్ద పంచా యితీ పెట్టాయి. ఫీజులు పెంచితే స్టైఫండ్‌ ఇస్తామన్నాయి. అందుకే ఫీజులు పెంచామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు మాత్రం స్టైఫండ్‌కు మెలిక పెడుతున్నాయి. ప్రస్తుతం చేరుతున్న సమయంలోనే సై్టఫండ్‌ ఇవ్వబోమని, అందుకు ఒప్పుకోవాలని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నాయని ఆరోగ్య సంస్కరణల వైద్యుల సంఘం (హెచ్‌ఆర్‌డీఏ) సెక్రటరీ జనరల్‌ శ్రీని వాస్‌ ‘సాక్షి’తో అన్నారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ విషయంపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డికి ఫిర్యాదు ఇచ్చామని ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు బ్యాంకు గ్యారంటీ తీసుకోకూడదని ఆయన స్పష్టంచేశారు.

రూ. 30 వేల వరకు సై్టఫండ్‌...
పీజీ వైద్య విద్య చదివే విద్యార్థులు ఒకవైపు చదువుతూనే మరోవైపు బోధనాసుపత్రులు, సంబంధిత ప్రైవేటు మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో జూనియర్‌ డాక్టర్లుగా వైద్య సేవలు అందిస్తుంటారు. వారు చేసే సర్వీసుకు ఆయా కాలేజీలు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో పీజీ వైద్య విద్యార్థులు చేసే వైద్య సేవలకు తప్పనిసరిగా స్టైఫండ్‌ ఇవ్వాలి. ఈ నిబంధనను ప్రభుత్వ వైద్య కాలేజీలు అమలుచేస్తున్నా, ప్రైవేటు కాలేజీలు అమలుచేయడంలేదు. మొదటి ఏడాది పీజీ విద్యార్థులకు నెలకు రూ. 27 వేలు, రెండో ఏడాదికి రూ. 28 వేలు, మూడో ఏడాదికి రూ. 30 వేలు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్లు పొందిన వారికీ ఇదే వర్తిస్తుంది. కానీ ఇప్పటివరకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచే కొంత మొత్తం తీసుకొని స్టైఫండ్‌గా ఇచ్చేవి. మరికొన్ని అదీ లేకుండా మొండిచెయ్యి చూపేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement