12 ఎకరాలకు మించితే 2 చెక్కులు

Sarkar decision on the aid - Sakshi

రూ.50 వేలకు మించిన పెట్టుబడి సాయంపై సర్కారు నిర్ణయం

రైతులకు పాన్‌ కార్డు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే..

పెరగనున్న చెక్కుల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూమి 12 ఎకరాలకు మించి ఉన్న రైతులకు పెట్టుబడి పథకం కింద రెండు చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి సాయం రూ.50 వేలకు మించిన సమయంలో ఒకే చెక్కు ఇవ్వడం వల్ల తప్పనిసరిగా పాన్‌ కార్డు వివరాలు నమోదు చేయాలి. దీంతో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

ఆ ప్రకారం రూ.49,999 వరకు రైతుకు ఒకే చెక్కు ఇవ్వొచ్చు. అంతకుమించి నగదు ఇవ్వాల్సి వస్తే రెండో చెక్కు ఇవ్వాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారం 12 ఎకరాలున్న రైతుకు రూ.4 వేల చొప్పున రూ.48 వేలు ఇవ్వాలి. 13 ఎకరాలున్న రైతుకు రూ.52 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రూ.52 వేలకు రెండు చెక్కులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పెద్ద రైతులకు సాయం రూ.లక్షకు మించితే మూడు చెక్కులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 12 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉన్న రైతులు దాదాపు 2 లక్షల మంది ఉంటారని అంచనా. ఆ ప్రకారం వారిలో చాలామందికి రెండు లేదా మూడు చెక్కులు కూడా ఇవ్వాల్సి ఉంది. దీని ప్రకారం బ్యాంకులు అదనంగా చెక్కులను ముద్రిస్తాయి. రైతుల సంఖ్యకు మించి చెక్కులు అధికం కానున్నాయి.

పెట్టుబడి పథకానికి పేరు
రైతు పెట్టుబడి పథకానికి ఏదో ఒక పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడు పేర్లు సూచించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు పంపాలని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పేరుపై అనేక మందితో అధికారులు సమాలోచన చేస్తున్నారు.

ప్రస్తుతం ‘రైతు లక్ష్మి’ వంటి పేర్లనూ ప్రచారంలో పెట్టారు. అయితే పథకాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా పేరుండాలని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే వైద్య ఆరోగ్య శాఖ పథకానికి పెట్టిన ‘కేసీఆర్‌ కిట్‌’లా సీఎం పేరు వచ్చేలా ఉంటే బాగుంటుందని అలాంటి పేరుపైనా కసరత్తు చేస్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top