రేవంత్ వర్సెస్ తుమ్మల

రేవంత్ వర్సెస్ తుమ్మల


సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జోక్యం చేసుకోవడంతో కొద్దిసేపు ఆసక్తికరమైన చర్చ జరిగింది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో పాలమూరు ఎత్తిపోతల, ప్రాణహిత-కాళేశ్వరం వంటి కొత్త ప్రాజెక్టులకు బదులు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మహబూబ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఐదు ప్రాజెక్టులు పూర్తవుతాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో తుమ్మల లేచి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణానదులపై ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త వాటిని మొదలుపెడతామన్నారు.


వెంటనే రేవంత్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే ఇప్పుడూ మంత్రులుగా ఉన్నారని, అప్పటి టీడీపీ హయాంలో తెలంగాణకు మేలు జరిగిందని చెబితే బాగుండేదని పేర్కొన్నారు. ‘జూరాల, ఎస్‌ఎల్‌బీసీ రెండోదశ, తెలంగాణకు నీళ్లు తెచ్చినప్పుడు ఆ సభ్యుడు (రేవంత్) లేడు. నిన్నగాక మొన్నొచ్చి తెలంగాణ.. టీడీపీ అంటున్నడు. అప్పుడు ఉంటే తెలిసేది’ అని తుమ్మల అన్నారు. ‘కే బినెట్ మొత్తం టీడీపీనే కదా. మాదగ్గర ట్రైనింగ్ పొందిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. మీతో పాటు నర్సన్న (నాయిని), లక్ష్మన్న (లక్ష్మారెడ్డి) కూడా టీడీపీ నుంచి పోయినోళ్లే’ అని రేవంత్ అనడంతో ‘మీ అధ్యక్షుడికి కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చాం’ అంటూ తుమ్మల కౌంటర్ ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top