జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నగర టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.
♦ టీఆర్‌ఎస్ ముమ్మర కసరత్తు
♦ త్వరలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నగర పార్టీ కార్యాలయం
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నగర టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. శుక్రవారం ఇదే అంశంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఇతర ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. గ్రేటర్ పరిధిలో పార్టీ బలాబలాలు, అన్ని డివిజన్లలో పార్టీ తాజా పరిస్థితి, సాధారణ,క్రియాశీల సభ్యత్వాల నమోదు ప్రక్రియ తీరుతెన్నులపై ఆరా తీశారు. భవిష్యత్‌లో పార్టీని అన్ని వర్గాలకు ఎలా చేరువ చేయాలన్న అంశంపై సమాలోచనలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అధికారం చేపట్టిన తరవాత జరగనున్న కీలకమైన బల్దియా ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని పక్షంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంశంపైనా చర్చించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, త్వరలో నగర పార్టీ కార్యాలయాన్ని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 140 క్వార్టర్‌లోకి తరలించాలని నిర్ణయించారు. ఈ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.