రైల్వే పార్కింగ్‌ దోపిడీ | Railway parking exploits | Sakshi
Sakshi News home page

రైల్వే పార్కింగ్‌ దోపిడీ

Feb 17 2018 2:23 AM | Updated on Feb 17 2018 3:04 AM

Railway parking exploits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ బోగీ ప్రయాణం కేవలం రూ.135. స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణమైతే రూ.280. కానీ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఒక ద్విచక్రవాహనాన్ని 24 గంటలపాటు పార్కింగ్‌ చేస్తే చెల్లించవలసిన ఫీజు ఎంతో తెలుసా..! అక్షరాలా మూడు వందల రూపాయలు. కారైతే ఏకంగా రూ.580 చెల్లించాలి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న పార్కింగ్‌ దోపిడీ ఇది.

ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. నాంపల్లి, కాచిగూడ తదితర ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులపై పార్కింగ్‌ ఫీజుల రూపంలోనే దక్షిణమధ్య రైల్వే ఏటా రూ.5 కోట్లకు పైగా ఆర్జిస్తోంది. మరోవైపు ఈ పార్కింగ్‌ స్థలాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవు. వాహనాలకు భద్రతనిచ్చే పై కప్పులు లేవు. ప్రయాణికుల సదుపాయాలను విస్మరించి అదనపు ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే కొనసాగిస్తున్న పార్కింగ్‌ దోపిడీ తీరిదీ...  

ఏటా రూ.5 కోట్ల పైమాటే..
ప్రతి రోజు రూ.కోటికి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించాలి. ఈ సదుపాయాల్లో భాగంగానే పార్కింగ్‌ వసతి కూడా ఉండాలి. కానీ స్టేషన్‌కు రెండువైపులా 6 పార్కింగ్‌ స్లాట్‌లను ఏర్పాటు చేసి అదనపు ఆర్జనకు తెర లేపారు. ప్రీమియం పార్కింగ్‌ స్థలాల్లో ద్విచక్ర వాహనాలపైన గంటకు రూ.18 చొప్పున, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలపైన గంటకు రూ.47 చొప్పున చార్జీలు విధించారు.

ఒక ద్విచక్ర వాహనాన్ని ప్రీమియం స్లాట్‌లో 3 గంటల పాటు పార్క్‌ చేస్తే రూ.54 వరకు చెల్లించాలి. కార్లకైతే రూ.94 వరకు ఖర్చవుతుంది. సాధారణ పార్కింగ్‌ స్థలాల్లో ద్విచక్ర వాహనాలకు ప్రతి గంటకు రూ.ఆరు చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తంగా ప్రీమియం పార్కింగ్‌లో 24 గంటల పాటు ద్విచక్రవాహనాన్ని నిలిపితే రూ.300, కార్లకైతే రూ.580 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్‌ ట్రైన్‌ చార్జీ కేవలం రూ.75. కానీ ద్విచక్రవాహనాన్ని 4 గంటల పాటు నిలిపితేనే రూ.72 వరకు చెల్లించాల్సి వస్తోంది.

నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్‌పైన ఏటా రూ.3 కోట్లు, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌లలో రూ.కోటి చొప్పున మొత్తంగా ఏటా రూ.5 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే వేలం పాటల్లో అధిక మొత్తానికి ముందుకొచ్చే కాంట్రాక్టర్‌లకు పార్కింగ్‌ కట్టబెడుతున్నారు. దీంతో రెండేళ్లకోసారి చార్జీలు పెరిగిపోతున్నాయి.

జీఎస్టీ దెబ్బ...
పార్కింగ్‌ ఫీజులే భారం అనుకుంటుంటే రైల్వే శాఖ వాటిపై 18 శాతం చొప్పున జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. దీంతో ఈ రెండేళ్లలోనే పార్కింగ్‌ రుసుము గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్ల తరహాలో రైల్వేస్టేషన్‌లలోనూ ప్రయాణికులకు పార్కింగ్‌పై రాయితీ సదుపాయం కల్పించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.


జీఎస్టీతో పెరిగిన పార్కింగ్‌ చార్జీలు(రూ.లలో)
వాహనం    రెండేళ్ల క్రితం    జీఎస్టీతో
కారు                  350       580
ద్విచక్రవాహనం     150       300


వాహనాలకు రక్షణ లేదు
వాహనాలకు ఎలాంటి రక్షణ లేదు. చాలావరకు ఓపెన్‌ స్థలాల్లోనే పార్కింగ్‌ ఉంది. ఇది చాలా అన్యాయం.   –మోహన్, మౌలాలి.

ఫీజు చాలా ఎక్కువ
ఫ్రెండ్‌ కోసం స్టేషన్‌కు వచ్చాను. గంట కు రూ.18 అంటే చాలా ఎక్కువే. సిటీ లో ఇంత ఎక్కువగా ఎక్కడా లేదు.   – ప్రశాంత్, సికింద్రాబాద్‌

క్యాబ్‌లో రావడం మేలు
ట్రైన్‌ ఎక్కాలంటే సొంత వాహనంపై స్టేషన్‌కు వచ్చి పార్కింగ్‌ చేసే కంటే క్యాబ్‌లో లేదా, ఆటోలో రావడం మంచిదనిపిస్తుంది.     –సందీప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement