రక్షణ శాఖలోనూ సృజనకు ప్రాధాన్యం

రక్షణ శాఖలోనూ సృజనకు ప్రాధాన్యం - Sakshi


- ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు యత్నాలు

- రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీశ్‌రెడ్డి వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్: రక్షణ మంత్రిత్వ శాఖలో సృజనకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కొత్త కొత్త ఆలోచనలను వస్తు, సేవల స్థాయికి తీసుకువచ్చేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం నుంచి కూడా పెట్టుబడులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ సెమీ కండక్టర్లు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్‌ఎస్‌ఐ) డిజైనింగ్‌లోనూ దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందన్నారు.వచ్చే ఏడాది జనవరి 7-11 వరకు జరిగే వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ 2017 వంటి అంతర్జాతీయ సదస్సు ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని, దేశానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఆలోచనలు, సృ జనను ప్రోత్సహించాలని ఆయన సదస్సు నిర్వాహకులకు సూచించారు. విద్యా, పరిశోధన, పరిశ్రమ రంగాలు కలిసికట్టుగా పనిచేస్తే ఇది సాధ్యమేనన్నారు. దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొంటారని వీఎల్‌ఎస్‌ఐడీ 2017 సదస్సు జనరల్ చెయిర్ జి.దశరథ్ తెలిపారు.

 

 హైదరాబాద్‌లో వీఎల్‌ఐఎస్‌ఐ అకాడమీ: జయేశ్‌రంజన్

 తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే క్రమంలో భాగంగా త్వరలోనే నగరంలో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. దీనికి అవసరమైన స్థలం గుర్తించామని, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేయడం ఈ డిజైన్ అకాడమీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. మైక్రో ప్రాసెసర్ తయారీ సంస్థ ఏఎండీ సహా అనేక కంపెనీలు ఈ అకాడమీ ఏర్పాటులో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలసి తాను ఇటీవల అమెరికాలో పర్యటించానని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ, ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ పాలసీకి అక్కడి ఐటీ దిగ్గజాలు మద్దతు తెలిపాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్‌క్యుబేటర్ టీ-హబ్  ఆధారంగా హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనూ ముందడుగు వేసేందుకు టీ-వర్క్స్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ రంగంలో ప్రొటోటైపింగ్ మొదలుకొని అనేక టెక్నాలజీల అభివృద్ధికి పనికొచ్చే టీ-వర్క్స్‌తో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ప్రొటోటైపింగ్ ల్యాబ్ ఒకటి ఆసక్తి చూపిందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top