సేవచేయండి.... ఆనందం పొందండి | Sakshi
Sakshi News home page

సేవచేయండి.... ఆనందం పొందండి

Published Mon, Aug 15 2016 1:47 AM

సేవచేయండి.... ఆనందం పొందండి - Sakshi

విలేకరుల సమావేశంలో సీఎం
సాక్షి, అమరావతి/విజయవాడ: వచ్చే పుష్కరాల నాటికి రాష్ట్రంలోని వాగులు, వంకలు అనుసంధానం కావాలని, ప్రజలు దీన్ని ఒక సంకల్పంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తను గతేడాది కృష్ణా, గోదావరి అనుసంధానాన్ని సంక్పలంగా తీసుకుని పట్టిసీమ ద్వారా పూర్తి చేశానని, ఈ కృష్ణా పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తరలించాలని సంకల్పం తీసుకున్నానని, పూర్తి చేస్తానని చెప్పారు. విజయవాడలో ఏర్పాటైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నదీమాతకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసి రుణం తీర్చుకోవాలన్నారు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా విజయవాడ వాసులు నదీజలాలను వినియోగించుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్లి బాగా సంపాదించారని, వారందరూ పుష్కరాల్లో సేవ చేసి ఆనందం, తృప్తి పొందాలన్నారు. దుర్గామాత దర్శనాని కి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నట్లు చెప్పారు.
 
డ్వాక్రా బజార్లను స్టార్టప్‌లుగా మార్చేందుకు మూలధనం..
డ్వాక్రా సంఘాల యూనిట్లను స్టార్టప్(అంకుర) సంస్థలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత మూలధనాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన డ్వాక్రా బజారు స్టాల్‌ను సీఎం ప్రారంభించారు.
 
మొక్కలు పెంచకుంటే రాయితీలు కట్
ఉద్యోగులు మొక్కలు పెంచకుంటే బదిలీలు, ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్లు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగిన ‘వనం-మనం’ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు పెంచి పచ్చదనాన్ని కాపాడే వారికోసం ప్రత్యేక పాలసీ, మొక్కల్ని పెంచే విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు ఇస్తామన్నారు.
 
సీఎం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement