ధూళి పంజా | peoples are suffering with dust particles | Sakshi
Sakshi News home page

ధూళి పంజా

Jul 23 2014 1:32 AM | Updated on Sep 2 2017 10:42 AM

ధూళి పంజా

ధూళి పంజా

నగరంలో పెరుగుతున్న కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సర్వే చేసింది.

కాలుష్య భూతం గ్రేటర్ వాసులను కాటేస్తోంది. పరిశ్రమలు,వాహనాల కాలుష్యంతో పాటు దుమ్ము, ధూళి సిటిజన్లకుప్రాణసంకటంగా మారాయి. నగరంలో పెరుగుతున్న కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సర్వే చేసింది. ఇందులో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. పీల్చే గాలిలో ధూళి రేణువుల సాంద్రత బాగా పెరిగిందని పీసీబీ గుర్తించింది.దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరవాసుల పరిస్థితి ఆందోళనకరంగా మారనుందనడం నిర్వివాదాంశం.
 
సాక్షి, సిటీబ్యూరో:
గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు, వాహన కాలుష్యంతో పాటు రోడ్లపై దుమ్ము, ధూళి కాలుష్యం భారీగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 40 లక్షలు వాహనాలు తిరుగుతున్నాయి. ఏటా రెండు లక్షల వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. పీల్చే గాలిలో ధూళిరేణువుల మోతాదు గణనీయంగా పెరిగిపోతోందంటూ పీబీసీ ఆందోళన చెందుతోంది.
 
పొగచూరుతున్న పౌరజీవనం
గ్రేటర్ పరిధిలో  వాహనాల సంఖ్య సుమారు 40 లక్షలకు చేరింది. వీటికి ఏటా 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కు పడిపోతోంది. దీంతో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరిగింది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.   
 
అంతటా అదే తీరు...
క్యూబిక్ మీటరు గాలిలో ధూళిరేణువులు(ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండబుల్ పార్టిక్యులార్ మ్యాటర్) వార్షిక సగటు 60 మైక్రోగ్రాములకు మించరాదు. అయితే సర్వేలో అత్యధికంగా బాలానగర్‌లో క్యూబిక్ మీటరు గాలిలో ఆర్‌ఎస్పీఎం మోతాదు 121 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఆబిడ్స్‌లో 109, ప్యారడైజ్ వద్ద 102, ఉప్పల్‌లో 101, పంజగుట్టలో 99, చార్మినార్ వద్ద 81, జూపార్కు వద్ద 39, జూబ్లీహిల్స్ వద్ద 64 మైక్రోగ్రాములుగా ధూళి కణాల సాంద్రత నమోదైనట్టు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. ఈ విపరిణామం వల్ల నగరవాసుల్లో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అలర్జీ, సైనస్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ధూళి రేణువులతో (ఆర్‌ఎస్‌పీఎం) దుష్ర్పభావాలు..
* ఆర్‌ఎస్‌పీఎం రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు,
* పొడిదగ్గు, బ్రాంకైటీస్‌కు కారణమవుతున్నాయి.
* దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది.
* చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
* తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది.
*  ఆర్‌ఎస్‌పీఎం మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
* ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటీస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే.
* ట్రాఫిక్రద్దీలో ప్రయాణం చేసిన వారు చురుకుదనం కోల్పోయి ఒళ్లంతా మగత, నొప్పులతో బాధపడుతున్నారు.
* ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ర్పభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement