నయా సాల్‌కు ఉత్సాహంగా స్వాగతం చెప్పడానికి నగరం ముస్తాబైంది. మంగళవారం ఉదయం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి.
=నేడు రోజంతా వేడుకలకు ఏర్పాట్లు
=అర్ధరాత్రి వరకూ పార్టీలకు అనుమతి
=‘సాగర్’, ఓఆర్‌ఆర్, ఎక్స్‌ప్రెస్ వేలోకి ‘నోఎంట్రీ’
=పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
=ఫ్లైఓవర్లపై రాకపోకలు నిషేధం
సాక్షి, సిటీబ్యూరో : నయా సాల్‌కు ఉత్సాహంగా స్వాగతం చెప్పడానికి నగరం ముస్తాబైంది. మంగళవారం ఉదయం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎవరికి వారు తమకు తగిన ప్రాంతాల్ని వేదికలుగా చేసుకుని ఉత్సాహంగా గడపనున్నారు. బార్‌లు, పబ్బుల్లో రాత్రి 12గంటల వరకు, హోటల్స్‌లో రాత్రి ఒంటిగంట వరకు పార్టీలు చేసుకోవడానికి పోలీసు విభాగం అనుమతించడం... పబ్స్, రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు, ఫంక్షన్ హాల్స్‌లో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎక్సైజ్ శాఖ అనుమతివ్వడంతో సిటీతో పాటు శివార్లూ కిటకిట లాడనున్నాయి.
నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే కార్యక్రమాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జంట కమిషనరేట్ల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిత్యం తీవ్ర ఒత్తిడి మధ్య బతుకెళ్లదీస్తున్న సగటు జీవి ఉత్సాహంగా జరుపుకొనే అవకాశమున్న ఏ ఒక్క సందర్భాన్నీ వదులు కోవట్లేదు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిని అత్యంత జోష్‌తో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఇవి స్నేహితులతో కలిసి సామూహికంగా చేసుకునేవి కావడంతో రోజంతో ఉత్సాహం నిండనుంది. కొన్ని సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ టికెట్లు విక్రయిస్తుండగా... వీటికి వెళ్లే ఆసక్తి లేనివారు ఎవరికి వారుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బ్యాచిలర్ రూమ్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. సోమవారం రాత్రి నుంచే పార్టీ మూడ్‌లోకి వెళ్లిన నగరవాసులు మంగళవారం ఉదయం నుంచీ ఆయా ప్రాంతాల్లో ఉత్సాహంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఔటర్’పై నిషేధాజ్ఞలు
=ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై నిషేధాజ్ఞలు విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
=మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌తో పాటు పీవీ ఎక్స్‌ప్రెస్‌వేలపై సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు.
=విమాన ప్రయాణికులు టికెట్లు చూపిస్తే కారులో ప్రయాణించే వారినే అనుమతిస్తారు.
=గూడ్స్ వాహనాలను అనుమతిస్తారు.
=వాహనాల్ని పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తే సీజ్ చేస్తారు.
=సైబరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు.
=ఫతేనగర్, హఫీజ్‌పేట ఫ్లైఓవర్‌లపై మాత్రం ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.