చెప్పినట్లే కేటీఆర్కు మున్సిపల్ శాఖ | Sakshi
Sakshi News home page

చెప్పినట్లే కేటీఆర్కు మున్సిపల్ శాఖ

Published Mon, Feb 8 2016 8:58 AM

చెప్పినట్లే కేటీఆర్కు మున్సిపల్ శాఖ - Sakshi

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకాలం తన వద్ద ఉన్న మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖను తనయుడు కేటీఆర్ కు అప్పగించారు. ఆ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో కీలక శాఖ కేటీఆర్ ఆధీనంలోకి వచ్చింది. ప్రస్తుతం పంచాయతీ రాజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను నిర్వహిస్తున్న కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖ కేటాయించారు.

జీహెచ్ ఎంసీ ఎన్నిక ప్రచార బాధ్యతను కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించగా గత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా టీఆర్ఎస్ అత్యధికంగా 99 డివిజన్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ అదే వేదిక నుంచి మున్సిపల్ శాఖ మార్పుపై ప్రకటన చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం అహోరాత్రులు కష్టపడుతూ గల్లీ గల్లీ తిరుగుతున్న కేటీఆర్ ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి వీలుగా ఆయనకు మున్సిపల్ శాఖను బదలాయిస్తానని ప్రకటించారు. అదే క్రమంలో బిజినెస్ రూల్స్ మేరకు శాఖను కేటీఆర్ పరిధిలోకి బదలాయిస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కేటీఆర్ కృషిని అభినందించింది.

కేబినేట్ లో అత్యంత కీలకమైన శాఖల్లో మున్సిపల్ వ్యవహారాల శాఖ కూడా ఒకటి. ప్రస్తుతం కేటీఆర్ వద్ద కీలకమైన పంచాయతీరాజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు ఉండగా, వాటికి అదనంగా ఇప్పుడు మరో కీలక శాఖ దక్కింది.

కేబినేట్ లో మార్పులు లేనట్టే
కేబినేట్ విస్తరణ లేదా మార్పుచేర్పులకు ఇక ఇప్పట్లో అవకాశం లేదని తాజా మార్పుతో స్పష్టమైందని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల లోపు కేబినేట్లో మార్పుచేర్పులకు అవకాశాలు ఉంటాయని గతంలో కొంత ప్రచారం జరిగింది. అలాంటి ఆలోచన ఉండి ఉంటే మున్సిపల్ శాఖ మార్పు కూడా ఆ సమయంలోనే చేసేవారని, అందుకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా శాఖ బదలాయింపు విషయాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేశారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా ప్రస్తుతం కేబినేట్లో మొత్తం 17 మంది మంత్రులున్నారు.

Advertisement
Advertisement