జనరిక్ పేరుతోనే మందులు రాయాలని వైద్యులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మళ్లీ ఆదేశించింది.
వైద్యులకు ఎంసీఐ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జనరిక్ పేరుతోనే మందులు రాయాలని వైద్యులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మళ్లీ ఆదేశించింది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌లో మందుల పేర్లను పెద్దక్షరాలతోనే (కేపిటల్ లెటర్స్) రా యాలని ఆదేశించింది. గతంలోనూ ఇదే ఆదేశాలు జారీ చేసినా అవి సరిగా అమలుకావడంలేదు. జనరిక్ అంటే జబ్బుకు డాక్టర్లు ఇచ్చే మందు (ఔషధం) మూల పదార్థం పేరు. మూల పదార్థం పేరుతోనే ప్రిస్క్రిప్షన్ రాయాలన్నది ఎంసీఐ తాజా ఆదేశం.
ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో జనరిక్ పేరుతో మందులు రాసేలా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రైవేటు, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో జనరిక్ పేరుతో మందులు రాసే విధానాన్ని అమలు చేయడం సాధ్యంకాదని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. గతంలోనూ ఎంసీఐ ఇదే ఆదేశాలిచ్చిందని నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి టి.గంగాధర్ ‘సాక్షి’తో అన్నారు.