
మతతత్వ అభ్యర్థికి ఓట్లేస్తారా: మల్లు రవి
రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతున్నదని, మతతత్వ పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తారా అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతున్నదని, మతతత్వ పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తారా అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కాంగ్రెస్ సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వమన్నారు.
బీజేపీ దీనికి విరుద్ధంగా మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ముస్లింల మీద దాడులు పెరిగాయన్నారు. కోవింద్ లాంటివ్యక్తి రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. భారతదేశ భవిష్యత్తును గమనంలో ఉంచుకుని, ఓటర్లంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని కోరారు. రైతులను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు.