
బీజేపీ కార్యాలయంలో తెగిపడ్డ లిఫ్టు
కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్కిన లిఫ్టు తెగిపడింది.
తప్పిన ప్రమాదం.. సురక్షితంగా కేంద్రమంత్రి నడ్డా, నేతలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్కిన లిఫ్టు తెగిపడింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎక్కిన లిఫ్టులో పరిమితికి మించి పార్టీ నేతలు ఎక్కడంతో వైరు తెగి మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోరులో పడింది. అయితే లిఫ్టులో ఎక్కిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో జరిగే అభినందన సభలో పాల్గొనేందుకు నడ్డా వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చి ఎక్కిన లిఫ్టు వైరు తెగింది. ఆ సమయంలో లిఫ్టులో ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్, పార్టీ ప్రధానకార్యదర్శులు చింతా సాంబమూర్తి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.