వాళ్లు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు | kishan reddy slams on TRS | Sakshi
Sakshi News home page

వాళ్లు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు

Sep 9 2016 8:12 PM | Updated on Oct 8 2018 8:39 PM

టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారిందని బీజేపీనేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

- సెప్టెంబరు 17న జాతీయజెండా రెపరెపలాడాలి
- బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
శాయంపేట(వరంగల్ జిల్లా)

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా గత, ప్రస్తుత పాలకులు మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని బీజేపీ శాసనసభ పక్ష నాయకులు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. తిరంగా యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట, మైలారం, జోగంపల్లి, కొప్పుల గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన కిషన్‌రెడ్డి.. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడి సెప్టెంబర్ 17న సాధించుకున్న తెలంగాణ విమోచనను పాలకులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన గుణపాఠం చెప్పేలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ ప్రాంతం నుంచి వేరుపడిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలిసిన జిల్లాల్లో అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర వేడుకలను అధికారికంగా జరుపుతుంటే ఒక్క తెలంగాణలో మాత్రం విస్మరిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో గత కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు తాను చేస్తున్నదేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, గంగుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement