సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన, న్యాయాధికారుల సమస్యపై ఇప్పటిదాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ సి.దామోదర్ రెడ్డి విమర్శించారు.
ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్న కేసీఆర్ అదే డిమాండుతో ఉద్యమిస్తున్న న్యాయవాదులను ఎందుకు అరెస్టుచేశారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు న్యాయవాదుల జేఏసీ తొత్తుగా మారిందన్నారు. న్యాయమూర్తులను సస్పెండ్ చేస్తే టీఆర్‌ఎస్‌ను న్యాయవాదులు ఎందుకు నిలదీయడం లేదని పొన్నం ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగి హైకోర్టు విభజన జరిగేదాకా హైదరాబాద్‌కు రావొద్దన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గాజులు తొడుక్కున్నారా? ఢిల్లీలో ఏం చేస్తున్నారు?అని పొన్నం ప్రశ్నించారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ నెల 30న అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ధర్నా చేయాలని లీగల్‌సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.